Telugu Global
National

25వేల పెట్టుబడి, 205 కిలోల ఉల్లి పంట, 415 కి.మీ. ప్రయాణం.. ఆ రైతుకు దక్కింది 8 రూపాయలు!

బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలోని గడాగ్ జిల్లాకు చెందిన పెవడెప్ప హళికేరి అనే రైతు వ్యథ ఇది. పెవడెప్ప 25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉల్లి పంటను పండించాడు. ఈ సారి వర్షాలు అధికంగా కురవడంతో పంట దిగుబడి తగ్గింది.

25వేల పెట్టుబడి, 205 కిలోల ఉల్లి పంట, 415 కి.మీ. ప్రయాణం.. ఆ రైతుకు దక్కింది 8 రూపాయలు!
X

25వేల రూపాయల పెట్టుబడి పెట్టి ఓ రైతు ఉల్లి పంట పండించాడు. అధిక వర్షాల వల్ల దిగుబడి తగ్గి 205 కిలోల పంట పండింది. ఆ పంటను 415 కిలోమీటర్ల దూరమున్న మార్కెట్ కు తీసుకెళ్ళాడు రైతు. అది కొన్న వ్యాపారి ఆ రైతు చేతిలో 8 రూపాయల 36 పైసలు పెట్టాడు. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలోని గడాగ్ జిల్లాకు చెందిన పెవడెప్ప హళికేరి అనే రైతు వ్యథ ఇది.

పెవడెప్ప 25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉల్లి పంటను పండించాడు. ఈసారి వర్షాలు అధికంగా కురవడంతో పంట దిగుబడి తగ్గడమే కాక, నాణ్యత కూడా కొద్దిగా తగ్గింది. దాంతో ఆ రైతుకు చేతికొచ్చిన పంట 205 కిలోలుగా తేలింది. గ్రామానికి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఉల్లికి సరైన ధర లేకపోడంతో ఆయన మరి కొందరు రైతులతో కలిసి 415 కిలోమీటర్ల దూరంలో ఉన్న యశ్వంత్ పూర్ మార్కెట్ కు తీసుకెళ్లాడు. ట్రాన్స్ పోర్ట్ కు కూడా బాగానే ఖర్చయ్యింది.

పోనీ అంత దూరం వెళ్ళాక అక్కడైనా మంచి రేటుందా అంటే అదీ లేదు. క్వింటాలుకు 200 రూపాయల ధర నడుస్తోంది అక్కడ. గతి లేక 205 కిలోలను 410 రూపాయలకు అమ్మేశాడు పెవడెప్ప హళికేరి. ఆ ఉల్లి కొనుక్కున్న వ్యాపారి ఈ రైతు చేతిలో 8 రూపాయల 36 పైసలు పెట్టాడు. ఇదేంటి 410 రూపాయలు రావాలి కదా అని మీరు ఆశ్చర్యపోతున్నారా..? ఆ రైతు కూడా దీన౦గా అదే అడిగాడు. అప్పుడు ఆ వ్యాపారి చెప్పిన లెక్కేంటంటే.. మొత్తం 410 రూపాయల్లో రవాణా చార్జీల కోసం 377 రూపాయలు, పోర్టర్ ఛార్జీల కోసం మరో 24 రూపాయలు కట్ చేయగా మిగిలింది 8 రూపాయల 36 పైసలు. ఇదీ వ్యాపారి చెప్పిన లెక్క.

ఇప్పుడు ఆ రైతుకు తానుపెట్టిన‌ 25 వేల రూపాయల పెట్టుబడి ఎలాగూ వెనక్కి రాలేదు. కనీసం వెనక్కి ఇంటికి వెళ్ళేందుకు బస్ చార్జీలు కూడా రాలేదు. కనీసం దారి ఖర్చులకన్నా వస్తాయనుకుంటే టీ తాగేందుకు సరిపడా సొమ్ము కూడా అందలేదని పెవడెప్ప హళికేరి ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆ రైతుకు వ్యాపారి ఇచ్చిన రిసిప్ట్ ను ఓ నెటిజన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఈ వార్త వైరల్ అయ్యింది. ''నరేంద్ర మోడీ, బీఎస్ బొమ్మై డబుల్ ఇంజన్ సర్కార్ కార్పోరేట్ కంపెనీల‌ ఆదాయాన్ని రెట్టింపు చేసింది. రైతులను బిచ్చగాళ్ళుగా మార్చింది.'' అని ఓ నెటిజన్ విరుచుకపడ్డాడు.


First Published:  30 Nov 2022 11:53 AM IST
Next Story