Telugu Global
National

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: ధనికులు బీజేపీ వైపు, పేదలు కాంగ్రెస్ వైపు... ఆసక్తికరమైన‌ సర్వే

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో వ్యవసాయ కార్మికులు, దినసరి కూలీల్లో కాంగ్రెస్‌కు 50 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 29 శాతం ఓట్లు వచ్చాయి. కానీ వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులను పరిశీలిస్తే, కాంగ్రెస్ కు 30 శాతం ఓట్లు రాగా బీజేకి 43 శాతం ఓట్లు వచ్చాయి. ఎక్కువ జీతాలు పొందుతున్న ఉద్యోగులకు, తక్కువ జీతాలు వచ్చే ఉద్యోగులు ఎంచుకున్న పార్టీల్లో కూడా తేడా ఉంది.

Karnataka Elections 2023: Rich towards BJP, Poor towards Congress... Interesting survey
X

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: ధనికులు బీజేపీ వైపు, పేదలు కాంగ్రెస్ వైపు... ఆసక్తికరమైన‌ సర్వే

క‌ర్నాటకలో మే10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పక్షాలు తీవ్ర ప్రచార, పంపక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాయి. మరో వైపు అనేక సంస్థలు తమ ప్రీ పోల్ సర్వేలతో హల్ చల్ చేస్తున్నాయి. ఎక్కువ సర్వేలు ఏ పార్టీకీ పూర్తి మెజార్టీ రాదని, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తుండగా, మరి కొన్ని సర్వేలు కాంగెస్ పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుందని తేల్చాయి. ఈ నేపథ్యంలో జరిగిన సర్వే వినూత్న పద్దతిలో జరిగింది. అన్ని సర్వేలు ప్రజలందరినీ ఒకే గాటన కట్టి సర్వేలు చేయగా కర్నాటకలో ప్రత్యామ్నాయ‌ ప్రజల మీడియా గా ఏర్పడిన ఓ బృందం 'ఈడినా' అనేసంస్థను ఏర్పాటు చేసిన సర్వే కొత్త పద్దతిలో తన సర్వే నిర్వహించింది. ప్రజల ఆర్థిక నేపథ్యం ఆధారంగా ఈ సర్వే నిర్వహించింది. ఇందులో ప్రజలను ధనికులు, మధ్యతరగతి , దిగువ మధ్యతరగతి, పేదలు , అత్యంత పేదలుగా విభజించారు.

ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో వ్యవసాయ కార్మికులు, దినసరి కూలీల్లో కాంగ్రెస్‌కు 50 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 29 శాతం ఓట్లు వచ్చాయి. కానీ వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులను పరిశీలిస్తే, కాంగ్రెస్ కు 30 శాతం ఓట్లు రాగా బీజేకి 43 శాతం ఓట్లు వచ్చాయి. ఎక్కువ జీతాలు పొందుతున్న ఉద్యోగులకు, తక్కువ జీతాలు వచ్చే ఉద్యోగులు ఎంచుకున్న పార్టీల్లో కూడా తేడా ఉంది.

పై తరగతి నుండి కింది తరగతికి వెళ్తున్నా కొద్దీ బీజేపీకి ఓట్లు తగ్గి కాంగ్రెస్ కు ఓట్లు పెరగడం ఈ సర్వేలో స్పష్టంగా కనిపించింది.

ఎగువ తరగతిలో కాంగ్రెస్ కంటే బిజెపి 13 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. మధ్యతరగతిలో కాంగ్రెస్ కంటే బిజెపి 1 పాయింట్ ఆధిక్యంలో ఉంది. దిగువ మధ్యతరగతిలో బీజేపీ కన్నా కాంగ్రెస్ 3 పాయింట్ల ఆధిక్యాన్ని కలిగి ఉంది. పేదలలో కాంగ్రెస్ 14 పాయింట్లు, అత్యంత పేదలలో 20 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కన్నా బీజేపీ అధికంగా ఓట్లు పోలయ్యే మొదటి మూడు తరగతుల జనాభా 40 శాతం కాగా కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో ఉన్న దిగువ రెండు వర్గాలు జనాభాలో 60 శాతం వరకు ఉన్నారు.

ఇందులో వర్గంతో పాటు కులం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అగ్రవర్ణాలలో ఎక్కువ శాతం మంది బీజేపీకి మద్దతుగా నిలవగా, లింగాయత్‌లలో కూడా బిజెపిదే ఆధిపత్యం. వొక్కలిగాలలో ఎక్కువ శాతం ఓటర్లు జెడిఎస్ కు మద్దతుగా నిల్చారు. కాగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, కురుబలలో 50 శాతం కంటే ఎక్కువ ఓటర్లు, ముస్లింలలో 70 శాతానికి పైగా ఓటర్లు కాంగ్రెస్ వైపు నిలబడ్డారు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, ప్రతి కులంలోని ధనికులు, పేదలు ఎంచుకున్న పార్టీలు వేరువేరుగా ఉన్నాయి.




First Published:  28 April 2023 10:43 AM GMT
Next Story