ఈ విజయం సంతృప్తిగా లేదు.. - కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరింత చురుగ్గా పనిచేయాలని డీకే శివకుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇకనుంచి మరింత బాధ్యతతో వ్యవహరించాలని కేడర్‌ను కోరారు.
ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో గెలిచి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎవరి మద్దతూ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పూర్తిస్థాయి మెజారిటీని ఆ పార్టీ సాధించింది. అయినా ఈ విజయం తనకు సంతృప్తిగా లేదని కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అంటున్నారు. ఆదివారం బెంగళూరులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సార్వత్రికంపైనే కన్ను..
రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరింత చురుగ్గా పనిచేయాలని డీకే శివకుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇకనుంచి మరింత బాధ్యతతో వ్యవహరించాలని కేడర్‌ను కోరారు. కర్నాటకలో లింగాయత్‌లు, అహిందాల ఓట్లు కాంగ్రెస్‌కు పడటంతో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో గెలిచింది ఒక్క స్థానమే..
కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం మాత్రమే దక్కింది. జేడీఎస్ కూడా ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ బెంగళూరు రూరల్ కైవసం చేసుకోగా.. జేడీఎస్ హసన్ లోక్‌సభ స్థానాన్ని గెలుపొందింది. ఇక బీజేపీ 25 స్థానాలను అప్పట్లో గెలుచుకుంది.
అనుకూలతను సద్వినియోగం చేసుకోవాలని..
ఈసారి లింగాయత్, అహిందా వర్గాల ఓట్లు తమవైపు ఉండటంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో ఉత్తమ ఫలితాలను ఆశిస్తోంది. మైనార్టీలు, దళితులు, వెనుకబడిన వర్గాలు అహిందా కిందికే వస్తారు. బీజేపికి గత కొంతకాలంగా అనుకూలంగా ఉంటున్న లింగాయత్ వర్గీయులు.. తమ నాయకుడు బీఎస్ యడియూరప్పకు తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో తాజా ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేశారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రజలు ఇదే పంథాను కొనసాగిస్తారని కాంగ్రెస్ భావిస్తోంది.