Telugu Global
National

Karnataka: బీజేపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వ‍ం

బుధవారం ప్రకటించిన అభ్యర్థుల రెండవ జాబితాలో ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టడంతో కర్ణాటక బీజేపీ శ్రేణులలో తిరుగుబాటు మొదలయ్యింది.

Karnataka: బీజేపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వ‍ం
X

కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల మొదటి లిస్ట్ ప్రకటించగానే బీజేపీలో మొదలైన అసంతృప్తి.. రెండవ లిస్ట్ విడుదలవగానే బ‌ద్ధ‌లైంది. అనేక మంది ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. అందులో చాలా మంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. సీనియర్ నాయకుడు ఈశ్వరప్ప తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాన‌ని, బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయబోనని ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ తనకు టికెట్‌ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేయడమే కాదు పార్టీని ఓడిస్తానని హెచ్చరించారు.

బుధవారం ప్రకటించిన అభ్యర్థుల రెండవ జాబితాలో ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టడంతో కర్ణాటక బీజేపీ శ్రేణులలో తిరుగుబాటు మొదలయ్యింది.

మూడుసార్లు ముదిగెరె ఎమ్మెల్యేగా ఎన్నికైన కుమారస్వామికి బదులు ఈసారి దీపక్ దొడ్డయ్యను రంగంలోకి దించాలని బీజేపీ నిర్ణయించింది. దాంతో తాను బీజేపీకి రాజీనామా చేశానని, త్వరలో అధికారికంగా రాజీనామా లేఖను అధిష్టానానికి అందజేస్తానని కుమారస్వామి ప్రకటించారు. ''పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల బాధగా ఉంది'' అని కుమారస్వామి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌కు రాసిన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

ఇక ప్రభుత్వ నిధులను తన కుమారులకు మళ్లించినందుకు ఇటీవల రెండేళ్ల జైలు శిక్ష పడిన హావేరీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైపై అవినీతి ఆరోపణలను బహిర్గతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈయనకు టికెట్‌ నిరాకరించడంతో తన మద్దతుదారులతో కలిసి నిరసనకు దిగారు. హవేరి (ఎస్సీ) నియోజకవర్గంలో ఆయన స్థానంలో గవిసిద్దప్ప ద్యామన్నవర్‌ను ఎంపిక చేశారు.

బయటరాయణపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న మునీంద్రకుమార్ కు బదులు బీజేపీ తమ్మేష్‌గౌడ్‌కు టికెట్ ఇవ్వడంతో మునీంద్రకుమార్ మద్దతుదారులు గురువారం సహకారనగర్‌లో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 1500 మంది పార్టీ కార్యకర్తలు బీజేపీకి రాజీనామా చేశారు. తమ్మేష్‌గౌడ్‌ బయటి వ్యక్తి అని, ఈ ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలతో ఎన్నడూ పని చేయలేదని కుమార్ మద్దతుదారులు పేర్కొన్నారు.

తమ్మేష్‌గౌడ్ బీఎస్‌ యడియూరప్పకు విధేయుడిగా ఉన్నందుకే టికెట్ ఇచ్చారని మునీంద్రకుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో పార్టీలో ప్రజాస్వామిక ప్రక్రియ ఉండేదని, సర్వే ఆధారంగానే టికెట్లు ఇచ్చేవారని, అయితే ఇప్పుడు పార్టీ సీనియర్లతో ఉన్న అనుబంధాన్ని బట్టి ఇస్తున్నారని మునీంద్ర ఆరోపించారు.

బైటరాయణపురలో మరో అభ్యర్థి ఎ రవి మద్దతుదారులు కూడా నిరసనకు దిగి రాజీనామాలు సమర్పించారు.

ఉడిపి జిల్లా బైందూర్ లో తమ నాయకుడికి కాకుండా గురురాజ్ గంటిహోల్ కు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ సుకుమార్ శెట్టి మద్దతుదారులు నిరసన ప్రదర్శన‌లు నిర్వహించారు. దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ పరిధిలోని కోస్టల్ బెల్ట్‌లో ఆరుగురు ప్రస్తుత ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ నిరాకరించింది. తొలి జాబితాలో ఎస్‌.అంగార (సుల్లియా), సంజీవ మతాండూరు (పుత్తూరు), లాలాజీ ఆర్‌ మెండన్‌ (కాపు), కె రఘుపతి భట్‌ (ఉడిపి)లకు టికెట్లు ఇవ్వలేదు.

కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 212 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో సుకుమార్ శెట్టి (బైందూరు), మాదాల్ విరూపాక్షప్ప (చన్నగిరి), ప్రొఫెసర్ లింగన్న (మాయకొండ), సిఎం నింబన్నవర్ (కల్‌ఘట్గి)లకు కూడా టికెట్లు దక్కలేదు.

మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గానికి, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న శివమొగ్గ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.

First Published:  13 April 2023 8:10 PM IST
Next Story