Telugu Global
National

కర్నాటకలో కాంగ్రెస్ రూల్.. హిజాబ్ కి గ్రీన్ సిగ్నల్..!

హిజాబ్ పై ఉన్న నిషేధం ఎత్తివేస్తే.. మళ్లీ కర్నాటకలో గొడవలు చెలరేగడం మాత్రం ఖాయం. మరి కాంగ్రెస్ ఈ విషయంలో ఆ తేనెతుట్టెను కదిలిస్తుందా.. మళ్లీ గొడవలకు కారణం అవుతుందా.. అనేది వేచి చూడాలి.

కర్నాటకలో కాంగ్రెస్ రూల్.. హిజాబ్ కి గ్రీన్ సిగ్నల్..!
X

కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థల్లో హిజాబ్ పై నిషేధం విధించడం, విద్యాసంస్థల్లో గొడవలు చెలరేగడం, విద్యార్థులు కోర్టు మెట్లెక్కడం, కోర్టు తీర్పుకి అనుకూలంగా హిజాబ్ పై నిషేధం కొనసాగడం తెలిసిందే. హిజాబ్ తో పాటు ఇతర మతపరమైన దుస్తులకు కూడా విద్యాసంస్థల్లోకి అనుమతి లేదు. అయితే ఇప్పుడు కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పాత నిర్ణయాలన్నిటినీ సమీక్షిస్తున్నారు. ఈ దశలో హిజాబ్ విషయంలో కూడా కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. హిజాబ్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసేలా కాంగ్రెస్ జీవో విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఆమ్నెస్టీ చొరవతో..

మానవహక్కులకోసం పోరాడే ఆమ్నెస్టీ ఇండియా సంస్థ.. హిజాబ్ పై నిషేధం ఎత్తివేయాలంటూ ఇటీవల కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. కాంగ్రెస్ కూడా బీజేపీ తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష చేపట్టింది. ఇందులో ప్రధానమైనది హిజాబ్ వివాదం. రాష్ట్రం తిరోగమించేలా ఉన్న ప్రతి ఉత్తర్వుని, బిల్లుని సమీక్షిస్తామన్నారు మంత్రి ప్రియాంక్ ఖర్గే. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే ఇప్పుడు కర్నాటక ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఆయన చెప్పారంటే కచ్చితంగా అది జరిగితీరుతుందనే అంటున్నాయి పార్టీ శ్రేణులు. వ్యక్తి హక్కులను ఉల్లంఘించే, రాజ్యాంగ విరుద్ధమైన బిల్లులన్నింటినీ సమీక్షిస్తామని, అవసరమైతే తిరస్కరిస్తామని అన్నారు ప్రియాంక్ ఖర్గే.

కర్నాటకలో బ‌జరంగ్‌ దళ్‌ ని సైతం నిషేధించాలనే చర్చ మంత్రిమండలిలో జరిగిందన్నారు ప్రియాంక్ ఖర్గే. సమాజంలో విద్వేషాలను వ్యాప్తి చేయడానికి, సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తే ఏ సంస్థనయినా సహించేది లేదని స్పష్టం చేశారాయన. అలాంటి సంస్థలతో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామన్నారు. అది బ‌జరంగ్‌ దళ్‌ అయినా, పీఎఫ్‌ఐ అయినా, మరో సంస్థ అయినా కఠినంగా ఉంటామని, శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తే నిషేధించేందుకు వెనకాడబోమన్నారు.

హిజాబ్ వివాదం మళ్లీ..

హిజాబ్ పై ఉన్న నిషేధం ఎత్తివేస్తే.. మళ్లీ కర్నాటకలో గొడవలు చెలరేగడం మాత్రం ఖాయం. మరి కాంగ్రెస్ ఈ విషయంలో ఆ తేనెతుట్టెను కదిలిస్తుందా.. మళ్లీ గొడవలకు కారణం అవుతుందా.. అనేది వేచి చూడాలి.

First Published:  25 May 2023 11:45 AM GMT
Next Story