ఉచితాల దెబ్బ.. కర్నాటకలో కరెంట్ చార్జీల పెంపు
కాంగ్రెస్ మాత్రం చార్జీల పెంపును సమర్థించుకుటోంది. పేదలకు ఉచిత కరెంటు ఇస్తున్నాం కదా అని చెబుతోంది. 200 యూనిట్లకంటే తక్కువ కరెంటు వాడితే అసలు చార్జీయే ఉండదు కదా అంటున్నారు కాంగ్రెస్ నేతలు.
కర్నాటకలో ఉచితాల దెబ్బ ప్రజలపై పెనుభారం పడుతోంది. తాజాగా కరెంటు చార్జీలను అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం సవరించింది. యూనిట్ కి 2.89 రూపాయలు వడ్డించింది. 200 యూనిట్లు పైబడి కరెంటు వినియోగించేవారు ఇకపై ఈ శ్లాబ్ లోకి వస్తారు. ఎన్ని యూనిట్లు ఎక్కువగా వాడితే అంత భారం పెరుగుతుందనమాట.
అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటకలో ఉచిత కరెంటు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే పేదలకు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇటీవల దీనికోసం కార్యాచరణ కూడా ప్రకటించింది ప్రభుత్వం. నియమ నిబంధనలు విడుదల చేసింది. ఉచిత కరెంటుతోపాటు.. మిగతా హామీల అమలుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ ఉచితాలన్నీ ఇవ్వాలంటే ఖజానాపై ప్రభావం పడుతుంది. అందుకే ఇప్పుడిలా ఆదాయ మార్గాలను అణ్వేషిస్తోంది కొత్త ప్రభుత్వం.
బీజేపీ విమర్శలు..
ఉచిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపడం సరికాదంటోంది ప్రతిపక్ష బీజేపీ. హామీల అమలుకోసం తిరిగి ప్రజలనుంచే డబ్బులు గుంజాలనుకోవడం మంచి పద్ధతి కాదంటున్నారు బీజేపీ నేతలు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం చార్జీల పెంపును సమర్థించుకుటోంది. పేదలకు ఉచిత కరెంటు ఇస్తున్నాం కదా అని చెబుతోంది. 200 యూనిట్లకంటే తక్కువ కరెంటు వాడితే అసలు చార్జీయే ఉండదు కదా అంటున్నారు కాంగ్రెస్ నేతలు.