Telugu Global
National

స్వతంత్రుల మద్దతు.. కాంగ్రెస్ @137

కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేసిన లత.. హరపనహళ్లిలో బీజేపీ నేత గాలి కరుణాకర్ రెడ్డిని ఓడించారు. ఈ విజయం కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలోనే పడింది. దర్శన్, లత.. ఇద్దరి మద్దతుతో కాంగ్రెస్ ఆధిక్యం 137కి చేరింది.

స్వతంత్రుల మద్దతు.. కాంగ్రెస్ @137
X

బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయంటే ఇదేనేమో.. గత కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ని వీడి బీజేపీలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు ఉత్సాహం చూపించారు. వారికి ఆశ చూపి ప్రభుత్వాన్ని చీల్చి పబ్బం గడుపుకుంది బీజేపీ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించిన తర్వాత మెల్లి మెల్లిగా ఇటువైపు వలసలు పెరిగాయి. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ బలం 135 సీట్లు కాగా రెండు రోజుల్లోనే ఆ బలం 137కి పెరిగింది.

వివిధ కారణాలతో కాంగ్రెస్ ని వీడిపోయినవారంతా ఇప్పుడు మళ్లీ హస్తానికి దగ్గరవుతున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ కి అన్నీ మంచి శకునములే అన్నట్టుగా ఉంది పరిస్థితి. 135 సీట్ల భారీ మెజార్టీతో పార్టీ గెలిచిన తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన దర్శన్ పార్టీకి దగ్గరయ్యారు. కాంగ్రెస్ ని వీడి తానెప్పుడూ వెళ్లలేదని, కొన్ని కారణాల వల్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు, తాను కాంగ్రెస్ తోనే ఉన్నానని చెప్పారు. మరో స్వతంత్ర అభ్యర్థి లతా మల్లికార్జున కూడా మాజీ సీఎం సిద్ధరామయ్యను కలసి తన మద్దతు తెలిపారు. కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో రెబల్ గా పోటీ చేసిన ఆమె.. హరపనహళ్లిలో బీజేపీ నేత గాలి కరుణాకర్ రెడ్డిని ఓడించారు. ఈ విజయం కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలోనే పడింది. దర్శన్, లత.. ఇద్దరి మద్దతుతో కాంగ్రెస్ ఆధిక్యం 137కి చేరింది.

రాబోయే రోజుల్లో మరింతమంది కాంగ్రెస్ కి దగ్గరవుతారని అంచనా. పక్క పార్టీలనుంచి వలసలను ప్రోత్సహించాల్సిన అవసరం కాంగ్రెస్ కి ఏ మాత్రం లేదు. అదే సమయంలో స్వతంత్రులు మాత్రం కాంగ్రెస్ కి దగ్గరయ్యే అవకాశాలున్నాయి. పార్టీలకు సంబంధం లేకుండా గెలిచిన నలుగురు స్వతంత్ర అభ్యర్థుల్లో ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ గూటికి చేరారు. పార్టీనుంచి బయటకు వెళ్లి ఎన్నికల్లో గెలవని రెబల్స్ కూడా కాంగ్రెస్ కి దగ్గరయ్యే అవకాశాలున్నాయి.

First Published:  15 May 2023 8:35 AM IST
Next Story