బురఖాలతో డ్యాన్స్.. నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు
ఇలాంటి వ్యవహారాలు మత విద్వేషాలను రెచ్చగొట్టే అవకాశముందని, అందుకే వారిపై సస్పెన్షన్ వేటు వేశామని చెప్పారు కాలేజీ అధికారులు.
కాలేజీ ఫెస్టివల్ లో బురఖాలు ధరించి వచ్చి ఐటమ్ సాంగ్ కి డ్యాన్స్ చేసిన నలుగురు విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ ఘటన కర్నాటకలోని మంగళూరులో జరిగింది. స్థానిక సెయింట్ జోసెఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇటీవలే కాలేజ్ ఫెస్ట్ జరిగింది. అందులో భాగంగా విద్యార్థులంతా నృత్యాలు చేస్తున్నారు. సడన్ గా దబంగ్ -2లో ఫెవికాల్ పాట మొదలైంది. నలుగురు విద్యార్థులు స్టేజ్ పైకి బురఖాలతో వచ్చి డ్యాన్స్ చేశారు. కేవలం 20 సెకన్లపాటు ఇలా డ్యాన్స్ చేశారు, ఆ తర్వాత వెంటనే మరో పాట మార్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కాలేజీ యాజమాన్యం స్పందించింది.
Some students found dancing in Burqa at Mangaluru engineering college in Karnataka, incident triggers controversy. pic.twitter.com/P8uIhOrVkO
— Nakshab (@your_nakshab) December 8, 2022
నష్టనివారణ చర్యలు..
బురఖాలతో వచ్చి డ్యాన్స్ చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసినట్టు కాలేజీ యాజమాన్యం ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. కాలేజీ ఫెస్టివల్ లో అసలు ఆ పాటను చేర్చలేదని, వారు సడన్ గా స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేశారని కాలేజీ ఇన్ చార్జ్ ప్రిన్సిపల్ వివరణ ఇచ్చారు.
ఐటంసాంగ్ తో వివాదం..
బురఖాలు ధరించి కాలేజ్ ఫెస్ట్ లో పాల్గొనడాన్ని ఎవరూ తప్పుబట్టరు కానీ, వీరు ఐటంసాంగ్ తో హడావిడి చేయడం, అందులోనూ కావాలనే కామెడీగా డ్యాన్స్ చేయడంతో యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వ్యవహారాలు మత విద్వేషాలను రెచ్చగొట్టే అవకాశముందని, అందుకే వారిపై సస్పెన్షన్ వేటు వేశామని చెప్పారు కాలేజీ అధికారులు. ఆమధ్య కర్నాటకలో హిజాబ్ వివాదం ఎలా పెరిగి పెద్దదైంతో తెలిసిందే. ఇప్పుడు బురఖా వ్యవహారం కూడా అలాగే సంచలనంగా మారే ప్రమాదం ఉండటంతో వెంటనే కాలేజీ యాజమాన్యం స్పందించింది. అయితే అప్పటికే ఈ బురఖా డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ కాలేజీ పేరు టాక్ ఆఫ్ ది స్టేట్ గా నిలిచింది.