Telugu Global
National

సీఎం మార్పు ఉత్తదే!.. గిట్టనివారు చేస్తున్న తప్పుడు ప్రచారం. - సీఎం బొమ్మై

'నేను పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటాను. ఎవరికీ ఏ అనుమానం అక్కర్లేదు. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారు.

సీఎం మార్పు ఉత్తదే!.. గిట్టనివారు చేస్తున్న తప్పుడు ప్రచారం. - సీఎం బొమ్మై
X

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రి మార్పు వ్యవహారంపై తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. సీఎంలుగా ఉండే నాయకులు మాస్ లీడర్స్ కాకపోతే ఇటువంటి వార్తలు ఎక్కువగా చక్కర్లు కొడతాయి. అధిష్టానం అదుపాజ్ఞల్లో ఉండాల్సిన నేతలు.. ఎప్పుడైనా తోకజాడిస్తే వారి కోపానికి గురికాక తప్పదు. ఇక ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైని మార్చబోతున్నారంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఈ వార్తలను ఎక్కువగా తెరమీదకు తీసుకొచ్చారు.

తాజాగా ఈ విషయంపై నేరుగా ముఖ్యమంత్రే స్పందించారు. 'నేను పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటాను. ఎవరికీ ఏ అనుమానం అక్కర్లేదు. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారు. వారికి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు పెద్దగా అవకాశం లేదు. అందుకే ఇటువంటి వార్తలు ప్రసారం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు' అంటూ సీఎం బొమ్మై వ్యాఖ్యానించారు.

త్వరలోనే రాష్ట్రంలో సీఎంను మారుస్తారనే వార్తల నేపథ్యంలో బొమ్మై గురువారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇలాంటి ఆధారంలేని, తప్పుడు ప్రచారం చేయడం కొత్తేమి కాదన్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలని చూస్తున్నారని, అయితే జనం వారిని నమ్మరు సీఎం బొమ్మై.

రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత సమయం వెచ్చించి, రోజుకు రెండు గంటలు అదనంగా పనిచేస్తానని చెప్పారు. అంతేకాకుండా పార్టీని బలోపేతం చేస్తూ, పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తానని అన్నారు. రాష్ట్రంలో సీఎంను మార్చడమనేది తప్పుడు ప్రచారమని, ప్రభుత్వం స్థిరంగా ఉందని చెప్పుకొచ్చారు. మరోవైపు బొమ్మై పూర్తికాలం పదవీలో కొనసాగుతారని మాజీ సీఎం యడ్యూరప్ప స్పష్టం చేశారు. పలువురు మంత్రులు, పార్టీ నాయకులు కూడా సీఎంకు మద్దతుగా నిలిచారు. కాగా, గత నెల 28తో బొమ్మై సీఎంగా ఏడాది పూర్తి చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు త్వరలోనే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం సీఎంను మారుస్తారని ఆరోపణలు చేశారు.

First Published:  11 Aug 2022 8:21 PM IST
Next Story