మా ఎమ్మెల్యే కనపడుట లేదు.. కర్నాటక బీజేపీ
ఇప్పటికే కమీషన్ రాజ్ సర్కార్ అంటూ కర్నాటకలో బీజేపీపై పెద్ద మచ్చ పడింది. ఎన్నికల ఏడాదిలో ఎమ్మెల్యే కొడుకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం, ఎమ్మెల్యేకి కూడా ఆ వ్యవహారంలో భాగం ఉందని తేలడం బీజేపీకి మరింత ఇబ్బందికర పరిణామం.
మా ఎమ్మెల్యే కనపడుటలేదు..
పేరు విరూపాక్షప్ప
వయసు 72 సంవత్సరాలు
మిస్ అయిన తేదీ 04-03-2023
దయచేసి లోకాయుక్త విచారణలో మా ఎ-1 ముద్దాయిని వెతికి పెట్టంది.. ఇట్లు పోటీలేని 40శాతం కమీషన్ సర్కార్
ప్రస్తుతం బెంగళూరులో వైరల్ అవుతున్న పోస్టర్లలో ఉన్న వివరాలివి. యూత్ కాంగ్రెస్ నేతలు ఈ పోస్టర్లను విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్పపై ఇలా కాంగ్రెస్ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు.
కర్నాటక మైసూర్ శాండిల్ సబ్బుల కుంభకోణంలో ఇటీవలే విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ 40 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఆ తర్వాత కర్నాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ ఆపీస్ లో మరో 2 కోట్లు దొరికాయి. ప్రశాంత్ ఇంటిలో కూడా సోదాలు చేయగా అక్కడ 6 కోట్ల రూపాయలు దొరికాయి. మొత్తం 8.4కోట్ల రూపాయల లంచావతారంలో ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన తండ్రి విరూపాక్షప్పకి కూడా సంబంధం ఉందని తేలడంతో పోలీసులు వెదుకులాట మొదలు పెట్టారు. కానీ ఆయన 4 రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో కాంగ్రెస్ నేతలు ఇలా ఆయనపై జోకులు పేలుస్తున్నారు. 40శాతం కమీషన్ సర్కార్ ఎన్ని కోట్ల కుంభకోణాలు చేస్తుందో చూడండి అంటూ ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు.
విరూపాక్షప్పకు బెయిల్..
ఎట్టకేలకు విరూపాక్షప్ప కృషి ఫలించింది. కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన 48గంటల్లో లోకాయుక్త ముందు లొంగిపోవాలని సూచించింది. కొడుకు లంచం తీసుకుంటూ పట్టుబడటంతో వెంటనే విరూపాక్షప్ప మాయం అయ్యారు. ప్రభుత్వానికి, పోలీసులకు తెలిసినా కూడా ఆయన సమాచారం బయటపెట్టలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే కమీషన్ రాజ్ సర్కార్ అంటూ కర్నాటకలో బీజేపీపై పెద్ద మచ్చ పడింది. ఎన్నికల ఏడాదిలో ఎమ్మెల్యే కొడుకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం, ఎమ్మెల్యేకి కూడా ఆ వ్యవహారంలో భాగం ఉందని తేలడం బీజేపీకి మరింత ఇబ్బందికర పరిణామం.