కర్నాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల
దక్షిణాదిలో తన బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ ఎలాగైనా కర్నాటకలో తిరిగి అధికారం నిలబెట్టుకోవాలని చూస్తోంది. కానీ అక్కడ అవినీతి సర్కారుపై ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది.
కర్నాటక అసెంబ్లీ గడువు మే 25తో ముగిసిపోతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 224 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది. మే-10న పోలింగ్ మే-13న ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఉంటాయి. ఈరోజునుంచి కర్నాటకలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది.
కర్నాటకలో 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2018 ఎన్నికల తర్వాత 104 సీట్లతో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే మెజార్టీ స్థానాలు మాత్రం లేవు. కానీ గవర్నర్ వాజూభాయ్ వాలా యెడ్యూరప్పకు అవకాశమిచ్చారు. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి, మెజార్టీ నిరూపించుకోలేక రెండు రోజులకే రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ కలసి అధికారంలోకి రాగా.. కాంగ్రెస్ సభ్యులకు ఎరవేసి, కూటమిని కూల్చేసి యడ్యూరప్ప మళ్లీ పీఠం ఎక్కారు. ఆ తర్వాత బీజేపీ అధిష్టానం సీఎం సీటుతో కుర్చీలాట ఆడింది. ఫలితంగా ప్రస్తుతం బసవరాజ్ బొమ్మై అక్కడ సీఎంగా ఉన్నారు. ప్రస్తుతం కర్నాటక అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల బలం 119. కాంగ్రెస్ కి 75మంది, జేడీఎస్ కి 28మంది ఎమ్మెల్యేలున్నారు. మళ్లీ మంచి మెజార్టీ సాధించి కర్నాటక పీఠం ఎక్కాలనేది బీజేపీ కల. దక్షిణాదిలో తన బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ ఎలాగైనా కర్నాటకలో తిరిగి అధికారం నిలబెట్టుకోవాలని చూస్తోంది. కానీ అక్కడ అవినీతి సర్కారుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది. ఈసారి కూటమిలో చీలికలు రాకుండా ప్రజలు మంచి తీర్పు ఇస్తారని ఆశిస్తున్నారు.
వృద్ధులకు ఇంటి నుంచే ఓటు..
కర్నాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లున్నారు. అందులో పురుషులు 2.62 కోట్లు, మహిళలు 2.59 కోట్లు. ఈ ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా ‘ఓట్ ఫ్రమ్ హోం’ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఓటు వేయొచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ వెల్లడించారు.