Telugu Global
National

కర్నాటక ఎన్నికలు: 224 సీట్లు.. 2613 మంది అభ్యర్థులు

16 నియోజకవర్గాల్లో.. అత్యథికంగా 15 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో రెండు బ్యాలెట్ యూనిట్లు వినియోగించాల్సి ఉంటుంది.

కర్నాటక ఎన్నికలు: 224 సీట్లు.. 2613 మంది అభ్యర్థులు
X

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పనిసరిగా మారింది. మొత్తం 224 స్థానాలకు 2613 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అంటే సగటున ఒక్కో స్థానానికి సుమారు 12మంది పోటీలో ఉన్నట్టు తేలింది. 517మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బరిలో 2613మంది నిలిచారు. ప్రధాన పార్టీలు మూడూ ఎక్కడా తగ్గేది లేదని తేల్చేశాయి. అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థుల్ని నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో వెనక్కి తగ్గింది, 223మంది అభ్యర్థుల్ని బరిలో దింపింది. జేడీఎస్ తరపున 207మంది పోటీలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 209మంది, బీఎస్పీ నుంచి 133మంది పోటీకి సై అంటున్నారు. గుర్తింపు లేని రాజకీయ పార్టీల తరపున 685మంది నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేస్తున్నారు. 918మంది స్వతంత్రులు పోటీకి దిగారు. సీపీఐ, జేడీయూ, ఎన్సీపీ కూడా కర్నాటకలో అభ్యర్థుల్ని నిలబెట్టాయి.

ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 113 సీట్లు ఉండగా, కాంగ్రెస్ కి 74, జేడీఎస్ కి 27 సీట్ల బలం ఉంది. ప్రస్తుతానికి సర్వేలన్నీ హంగ్ కే మొగ్గు చూపుతున్నాయి. ఉన్న పార్టీల్లో కాంగ్రెస్ కి కాస్త మెజార్టీ ఎక్కువగా ఉండే అవకాశముంది. హంగ్ ఏర్పడితే ఎవరు ఎవరితో జట్టు కడతారనేది తేలాల్సి ఉంది. స్పష్టమైన మెజార్టీ లేకపోవడం వల్లే గతంలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమిని కూల్చేయగలిగింది బీజేపీ. ఈసారి కూడా అలాంటి పరిస్థితే వస్తే ఎమ్మెల్యేలతో మళ్లీ కమలదళం బేరసారాలాడటం ఖాయం.

కర్నాటక అసెంబ్లీలో పోటీకి సై అంటున్న 2,613 మంది అభ్యర్థుల్లో.. 2,427 మంది పురుష అభ్యర్థులు కాగా, 185 మంది మహిళలు, మిగిలినవారు ఇతరులు. 16 నియోజకవర్గాల్లో.. అత్యథికంగా 15 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో రెండు బ్యాలెట్ యూనిట్లు వినియోగించాల్సి ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్ కి రెబల్ పోరు తప్పదని తేలింది. మే 10న కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి, 13వతేదీన ఫలితాలు విడుదల చేస్తారు.

First Published:  25 April 2023 12:27 PM IST
Next Story