మా సర్వేలు మాకున్నాయ్.. 130 సీట్లు గ్యారెంటీ..
కర్నాటకలో బీజేపీకి అంత సీన్ లేదని ఈపాటికే తేలిపోయింది. సొంతగా అధికారంలోకి వచ్చే అవకాశం ఆ పార్టీకి లేదు, ఆ మాటకొస్తే సంకీర్ణ సమీకరణాలు కూడా అక్కడ కుదిరేలా లేవు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా హంగ్ గ్యారెంటీ అని సర్వేలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఆ హంగ్ లో కూడా కాంగ్రెస్ కి కాస్తో కూస్తో మెజార్టీ ఎక్కువ వస్తుందని అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ సెంచరీ దగ్గరకు వచ్చి ఆగిపోతుందని, ఆ తర్వాతి స్థానంలో ప్రస్తుత అధికార బీజేపీ ఆగిపోతుందని సర్వేలు ఘోషిస్తున్నాయి. కానీ కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై మాత్రం అధికారం తమదేనంటున్నారు. తమ సర్వేలు తమకు ఉన్నాయని డాంబికాలు పలుకుతున్నారు. ఆయన చెప్పే గణాంకాలు కూడా కాస్త విచిత్రంగానే ఉన్నాయి. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్నాటకలో 130చోట్ల బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు బొమ్మై.
అంత సీనుందా..?
కర్నాటకలో బీజేపీకి అంత సీన్ లేదని ఈపాటికే తేలిపోయింది. సొంతగా అధికారంలోకి వచ్చే అవకాశం ఆ పార్టీకి లేదు, ఆ మాటకొస్తే సంకీర్ణ సమీకరణాలు కూడా అక్కడ కుదిరేలా లేవు. అయితే కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ మూడు ముక్కలాటలో కర్నాటక ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో తేలాల్సి ఉంది. అవినీతి సర్కారు, కమీషన్ రాజ్ గా ముద్రపడిన బీజేపీ ప్రభుత్వం తిరిగి ఏర్పాటయ్యే అవకాశమే లేదని తేలిపోయింది. ఈ దశలో బొమ్మై మాత్రం సెల్ఫ్ డబ్బా బాగానే కొట్టుకోవడం విశేషం.
130 కంటే ఎక్కువ సీట్లు తమకు గ్యారెంటీ అంటున్నారు కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అయితే ఆయనది మేకపోతు గాంభీర్యమేనంటున్నాయి విపక్షాలు. సర్వేలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మే-10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. మే-13న ఫలితాలు వెలువడతాయి.