Telugu Global
National

కరెంటు ఫ్రీ.. కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: ఏపీలో వైసీపీ చేపట్టిన నగదు బదిలీని కూడా ఆదర్శంగా తీసుకున్నారు కాంగ్రెస్ నేతలు. కుటుంబ పెద్దగా ఉండే మహిళకు నెలకు రూ.2వేల ఆర్థిక సాయం చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు.

Karnataka Assembly Election 2023: Karnataka congress manifesto released
X

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: కరెంటు ఫ్రీ.. కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో

కర్ణాటక ఎన్నికల సమరానికి కాంగ్రెస్ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసింది. అధికారంలోకి వస్తే కన్నడనాట ఏయే పథకాలు అమలులోకి తెస్తామనే విషయంపై ఇప్పటికే జనాలకు క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ప్రియాంక గాంధీ సభల్లో మేనిఫెస్టోలో చేర్చబోయే అంశాలను ముందుగానే ప్రకటించారు. తాజాగా అధికారికంగా కాంగ్రెస్ కర్నాటక మేనిఫెస్టో విడుదల చేసింది.

ఉచితాలున్నాయి కానీ..!

ఉచితాల విషయంలో మరీ బీజేపీ లాగా ఓవర్ యాక్షన్ చేయలేదు కాంగ్రెస్. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల కరెంటు వరకు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఎంత వాడుకుంటే అంత బిల్లు చెల్లించాలి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఉచిత కరెంటు సక్సెస్ ఫార్ములాని ఇక్కడ వాడుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. ఇక ఏపీలో వైసీపీ చేపట్టిన నగదు బదిలీని కూడా ఆదర్శంగా తీసుకున్నారు కాంగ్రెస్ నేతలు. కుటుంబ పెద్దగా ఉండే మహిళకు నెలకు రూ.2వేల ఆర్థిక సాయం చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు.


నిరుద్యోగ భృతి..

మహిళలతోపాటు యువతని ఆకట్టుకునే పథకాలను ప్రకటించింది కాంగ్రెస్. డిగ్రీ చదివి ఉద్యోగం రాని వారికి రెండేళ్ల వరకు నెలకు రూ.3వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది. డిప్లమా చదివిని వారికి 1500 రూపాయలు ఇస్తారు.

మిగతా హామీలు ఇలా ఉన్నాయి..

- కేఎస్ఆర్టీసీ-బీఎంటీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం.

- నైట్​ డ్యూటీ చేసే పోలీసులకు నెలకు రూ. 5వేల స్పెషల్​ అలవెన్స్

- బ‌జరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలపై నిషేధం.

- ఎస్సీ రిజర్వేషన్ ను 15 శాతం నుంచి 17 శాతానికి పెంచడం. ఎస్టీ రిజర్వేషన్ 3 నుంచి 7 శాతానికి పెంపు.

- మైనార్టీ రిజర్వేషన్ 4 శాతానికి పునరుద్ధరించడం. లింగాయత్, వొక్కలిగ, ఇతర సామాజిక వర్గాలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేందుకు హామీ.

కాంగ్రెస్ మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విడుదల చేశారు. కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సారి కచ్చితంగా కర్నాటకలో సోలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

First Published:  2 May 2023 12:14 PM IST
Next Story