Telugu Global
National

కర్నాటకలో రిజర్వేషన్ల పెంపు.. ప్రైవేట్‌ సెక్టార్‌కూ వర్తింపచేయాలని డిమాండ్

రాజ్యాంగ రక్షణ కల్పించకుండా.. ఈ తరహా పెంపు కేవలం ఎన్నికల్లో కంటితుడుపు చర్యగానే భావించాల్సి వస్తుందని.. కాబట్టి ఈ రిజర్వేషన్ల పెంపును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్పించాలని డిమాండ్ చేశారు.

కర్నాటకలో రిజర్వేషన్ల పెంపు.. ప్రైవేట్‌ సెక్టార్‌కూ వర్తింపచేయాలని డిమాండ్
X

కర్నాటకలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ కోటా పెంపున‌కు సంబంధించిన బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. సోమవారం ఈ బిల్లుపై కర్నాటక అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బిల్లుకు మద్దతు తెలిపాయి. అయితే ఈ బిల్లు న్యాయపరంగా నెగ్గుతుందా లేదా అన్న దానిపై విపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి.

ప్రస్తుతం కర్నాటకలో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు ఉండగా కొత్త బిల్లు వల్ల ఆ శాతం 17కు పెరుగుతుంది. ఎస్టీల రిజర్వేషన్ కోటా 3 నుంచి 7 శాతానికి పెరుగుతుంది. ఈ పెంపుతో కర్నాటకలో మొత్తం రిజర్వేషన్ల శాతం 56కు పెరిగింది.

రిజర్వేషన్ల పెంపు ఎంతో క్లిష్టమైన వ్యవహారం అయినప్పటికీ తాము ముందుకెళ్లామ‌ని న్యాయ శాఖ మంత్రి మధుస్వామి సభలో వివరించారు. రిజర్వేషన్ల పెంపున‌కు సహేతుకమైన కారణాలను కూడా బిల్లులో ప్రభుత్వం చూపెట్టిందన్నారు. పైగా కొందరు ఎస్టీ విద్యార్థులు తమకు సరైన శాతంలో రిజర్వేషన్‌ లేదని హైకోర్టుకు వెళ్లగా.. కోర్టు కూడా సదరు విద్యార్థుల విజ్ఞప్తిలో హేతుబద్దత ఉంటే పరిశీలించాలని చెప్పిందని.. కాబట్టి కోర్టులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టకపోవచ్చని న్యాయ శాఖ‌ మంత్రి అభిప్రాయపడ్డారు.

ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య మాత్రం ఈ బిల్లు అమలుపై అనుమానం వ్యక్తం చేశారు. గతంలో వీరప్పమెయిలీ ప్రభుత్వం కూడా రిజర్వేషన్ల శాతాన్ని పెంచేందుకు ప్రయత్నించగా అది అమలు సాధ్యం కాలేదని.. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే వస్తుందన్నది తమ భయమన్నారు. రాజ్యాంగ రక్షణ కల్పించకుండా.. ఈ తరహా పెంపు కేవలం ఎన్నికల్లో కంటితుడుపు చర్యగానే భావించాల్సి వస్తుందని.. కాబట్టి ఈ రిజర్వేషన్ల పెంపును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్పించాలని డిమాండ్ చేశారు.

ఇందుకు స్పందించిన మంత్రి.. 9వ షెడ్యూల్‌లో చేర్చినంత మాత్రాన అది న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా ఉంటుందన్న గ్యారెంటీ లేదని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లను ప్రైవేట్ సెక్టార్‌కు విస్తరించాలని కూడా కాంగ్రెస్ పక్ష నేత సిద్ధారామయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో కేవలం 2 శాతం ఉద్యోగాలు మాత్రమే ఉంటున్నాయని.. మిగిలిన ఉద్యోగాలన్నీ ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయని.. కాబట్టి ప్రైవేట్ రంగానికి రిజర్వేషన్లను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.

First Published:  27 Dec 2022 8:59 AM IST
Next Story