విపక్షాల ఐక్యతకు జోడో యాత్ర చిహ్నం.. కపిల్ సిబల్ ఆసక్తికర వ్యాఖ్యలు
జి-23 నాయకుల్లో ఒకరైన సిబల్, కాంగ్రెస్ అధిష్టానంతో తీవ్రంగా విభేదించి బయటికొచ్చారు, అప్పటినుంచి ఆయన కాంగ్రెస్ పై ఎలాంటి కామెంట్లు చేయలేదు. ఇప్పుడు జోడో యాత్రని ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు కపిల్ సిబల్, కాంగ్రెస్ ని వీడి బయటకు వెళ్తారని ఎవరూ అనుకోలేదు. కానీ ఆయన కాంగ్రెస్ ని వదిలి సమాజ్ వాదీ పార్టీలో చేరి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అక్కడితో ఆయనకు కాంగ్రెస్ కి ఉన్న బంధం తెగిపోయిందనుకోలేం. తాజాగా భారత్ జోడో యాత్రపై కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. విపక్షాల ఐక్యతకు జోడో యాత్ర నిదర్శనం అని అన్నారాయన. భారత్ జోడో యాత్ర విజయవంతమైందని, దేశం కోసం ప్రజలంతా ఏకతాటిపై ఉండాలనే విషయాన్ని మరోసారి ఈ యాత్ర రుజువు చేసిందని చెప్పారు సిబల్.
రాహుల్ గాంధీ సమాజంలోని భిన్నమైన అంశాలను ఒకచోట చేర్చగలిగారని, దేశం ఐక్యంగా ఉండటం ఎంత అవసరమో తెలియజెప్పారని అన్నారు. కాంగ్రెసేతర పార్టీలను ఒకేతాటిపై చేర్చే నమ్మకాన్ని జోడో యాత్ర కలిగించిందన్నారు సిబల్. జి-23 నాయకుల్లో ఒకరైన సిబల్, కాంగ్రెస్ అధిష్టానంతో తీవ్రంగా విభేదించి పార్టీనుంచి బయటికొచ్చారు, అప్పటినుంచి ఆయన కాంగ్రెస్ పై ఎలాంటి కామెంట్లు చేయలేదు. ఇప్పుడు జోడో యాత్రని ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ ఎల్ రాందాస్, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ సహా.. సైనిక విభాగాల్లో పనిచేసినవారు, పలువురు రచయితలు, సినీరంగానికి చెందినవారు, అనుభవజ్ఞులు, శివసేనకు చెందిన ఆదిత్య థాక్రే, ప్రియాంక చతుర్వేది, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు కూడా భారత్ జోడో యాత్రలో పాల్కొన్నారని గుర్తు చేశారు సిబల్. ఈయాత్ర ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చిందని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల గురించి తాను మాట్లాడనంటున్న సిబల్, దేశవ్యాప్తంగా ప్రజలు కలసి ఉండాల్సిన అవసరాన్ని ఈ యాత్ర గుర్తు చేసిందన్నారు.
జనవరి 30న భారత్ జోడో యాతర్ శ్రీనగర్ లో ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీల నేతలను కూడా కాంగ్రెస్ ఆహ్వానించింది. జోడో యాత్ర విషయంలో కాంగ్రెస్ సంతోషంగా ఉంది. యాత్రలో విపక్షాల మధ్దతు కాంగ్రెస్ కి ధైర్యాన్నిచ్చింది.