పరువు నష్టం కేసులో స్టే కోరుతూ కంగనా పిటిషన్
తన కేసు విచారణపై స్టే విధించాలని కోరిన కంగనా.. ఇదే కేసులో తాను వేసిన క్రాస్ పిటిషన్‌తో కలిపి దానిని విచారించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనపై నమోదైన పరువు నష్టం కేసులో విచారణకు స్టే విధించాలని కోరుతూ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగేలా జాతీయ టీవీ ఛానళ్లలో కంగన మాట్లాడారని ఆరోపిస్తూ ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ 2020లో ఆమెపై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
మరోవైపు నేరపూరిత కుట్ర, గోప్యతకు భంగం కలిగించడం వంటి ఆరోపణలతో కంగన.. అక్తర్‌పై క్రాస్ పిటిషన్ వేశారు. ఆ మేరకు 2023 జూలై 24న అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు అక్తర్‌కు సమన్లు జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా ఆయన దిండోషిలోని సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. కంగనా ఫిర్యాదుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్, సమన్ల జారీపై ఆ కోర్టు స్టే విధించింది.
తాజాగా తన కేసు విచారణపై స్టే విధించాలని కోరిన కంగనా.. ఇదే కేసులో తాను వేసిన క్రాస్ పిటిషన్‌తో కలిపి దానిని విచారించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తనను మోసం చేశాడంటూ కంగనా గతంలో తీవ్ర ఆరోపణలు చేయగా, ఆ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. అదే క్రమంలో 2020లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. హృతిక్‌తో గొడవ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇదే విషయంలో జావేద్ తనను ఇంటికి పిలిచి మరీ బెదిరించారని ఆమె తెలిపారు. కంగనా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జావేద్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు.