కాంగ్రెస్‌కు కమల్ హాసన్ మద్దతు.. వచ్చే వారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ముందుకు సాగాలని కమల్ హాసన్ భావిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ కూటమిగా ఉన్నాయి. ఇప్పుడు అదే కూటమిలో చేరేందుకు మక్కల్ నీదిమయ్యం ప్రయత్నిస్తోంది.
కర్ణాటకలో మే 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎవరికి వారు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండు పార్టీలకు చెందిన అగ్రనేతలు కర్ణాటకలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ కు మద్దతుగా ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీదిమయ్యం అధినేత కమల్ హాసన్ ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని మక్కల్ నీదిమయ్యం నేతలు ధ్రువీకరించారు.
కాంగ్రెస్‌కు మద్దతుగా కర్ణాటకలో ప్రచారం నిర్వహించాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కమల్ హాసన్‌ను కోరినట్లు వారు చెప్పారు. వచ్చే నెల మొదటి వారంలో కమల్ హాసన్ కర్ణాటకలో కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహిస్తారని మక్కల్ నీదిమయ్యం నాయకులు ప్రకటించారు.
కమల్ హాసన్ 2018లో మక్కల్ నీదిమయ్యం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, మరే ఎన్నికల్లో కానీ కమల్ హాసన్ పార్టీ ప్రభావం చూపించలేదు. దక్షిణ కోయంబత్తూర్ నుంచి పోటీ చేసిన కమల్ హాసన్ కూడా ఓడిపోయారు. ఇక కొంతకాలంగా రాజకీయాలకు తాత్కాలిక విరామం ఇచ్చిన కమల్ హాసన్ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ముందుకు సాగాలని కమల్ హాసన్ భావిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ కూటమిగా ఉన్నాయి. ఇప్పుడు అదే కూటమిలో చేరేందుకు మక్కల్ నీదిమయ్యం ప్రయత్నిస్తోంది. కొన్ని నెలల కింద రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడోయాత్రలో కూడా కమల్ హాసన్ పాల్గొని రాహుల్ వెంట నడిచారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు కర్ణాటకలో ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించాలని కమల్ హాసన్ నిర్ణయించుకున్నారు.