తదుపరి సీజేఐగా చంద్రచూడ్ పేరుని సిఫారసు చేసిన జస్టిస్ లలిత్
లలిత్ సిఫారసు మేరకు డి.వై. చంద్రచూడ్ నవంబర్ 9న నూతన సీజేఐగా బాధ్యతలు చేపడతారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. 2024 నవంబరు 10న చంద్రచూడ్ పదవీ విరమణ చేస్తారు.
సుప్రీం కోర్టు 50వ న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నియమితులు కాబోతున్నారు. ఆయన పేరుని ప్రస్తుత సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ సిఫారసు చేశారు. సుప్రీం కోర్టులో జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనను ప్రస్తుత సీజేఐ లేఖ రూపంలో కేంద్ర న్యాయశాఖకు పంపాల్సి ఉంది. ఆ తర్వాత కేంద్ర న్యాయశాఖ, దాన్ని ప్రధాని పరిశీలన కోసం పంపుతుంది. ప్రధాని ఆమోదం తర్వాత రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు.
నవంబర్ 8 వరకు లలిత్..
సుప్రీం కోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది ఆగస్ట్ 27న ఎన్వీ రమణ నుంచి బాధ్యతలు స్వీకరించారు జస్టిస్ లలిత్. ఆయన పదవీకాలం నవంబర్ 8 వరకు ఉంది. ఆ తర్వాత కొత్త సీజేఐ ఎవరనే విషయంపై సుప్రీం కోర్ట్ ఫుల్ బెంచ్ నిర్ణయం తీసుకుంది. లలిత్ సిఫారసు మేరకు డి.వై. చంద్రచూడ్ నవంబర్ 9న నూతన సీజేఐగా బాధ్యతలు చేపడతారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. 2024 నవంబరు 10న చంద్రచూడ్ పదవీ విరమణ చేస్తారు.
తండ్రి వారసుడిగా..
జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ 1959 నవంబరు 11న మహారాష్ట్రలో జన్మించారు. ఆయన తండ్రి యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టు చరిత్రలో అత్యధిక కాలం కొనసాగిన సీజేఐగా వైవీ చంద్రచూడ్ గుర్తింపు పొందారు. ఆయన వారసుడిగా ఇప్పుడు డీవై చంద్రచూడ్ సీజేఐగా రాబోతున్నారు. బాంబే హైకోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన డీవై చంద్రచూడ్.. 1998లో భారత అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 2000లో బాంబే హైకోర్ట్ న్యాయమూర్తిగా పనిచేశారు. 2016లో సుప్రీం కోర్టుకి వచ్చారు. 2021నుంచి ఆయన సుప్రీం కోర్టు కొలీజియం సభ్యుడిగా కొనసాగుతున్నారు. శబరిమలలో మహిళల ప్రవేశం వంటి కీలక కేసులకు తీర్పులిచ్చిన ధర్మాసనంలో చంద్రచూడ్ కూడా ఉన్నారు.