మోదీ-షా పర్వంలో మహిళలకు న్యాయమేది?
రాజకీయ లబ్ది కోసమే బిల్కిస్ బానో కేసులో ఏకపక్షంగా దోషులని విడుదల చేశారని గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌తో తేటతెల్లమైంది.
రాజకీయ లబ్ది కోసమే బిల్కిస్ బానో కేసులో ఏకపక్షంగా దోషులని విడుదల చేశారని గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌తో తేటతెల్లమైంది. ముస్లిం మహిళకు జరిగిన అన్యాయాన్ని ఇతరులు ఎవరూ ప్రశ్నించరని, అంతిమంగా ఇది తమ హిందూత్వ రాజకీయాలకు ఉపకరిస్తుందన్న ఉద్దేశంతోనే బిజెపి ప్రభుత్వాలు ఖైదీల శిక్షా కాలాన్ని తగ్గించి ముందస్తుగా జైలు నుంచి విడుదల చేశాయి.
2002 నాటి గోద్రా అల్లర్ల సమయాన గర్భంతో ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరపడమే గాక ఆమె మూడేళ్ళ బిడ్డను కొట్టి చంపారు. మొత్తంగా ఆమె కుటుంబసభ్యుల్లో 13 మంది ని దారుణంగా చంపిన నేరం చిన్నదేం కాదు. కేవలం వారు మరో మతానికి చెందినవారన్న కారణంగా అతి దుర్మార్గంగా దాడి చేసి చంపడం తీవ్రమైన నేరమని సిబిఐ న్యాయస్థానం విస్పష్టంగా తేల్చి చెప్పింది. కనుక ఈ నేరానికి పాల్పడిన 11 మంది దోషులకు రెమిషన్ మంజూరు చేయడానికి వీల్లేదని సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తితో పాటు, ముంబయి క్రైం బ్రాంచ్ ఎస్.పి. కూడా దోషుల విడుదల సరి కాదని ఈ ఏడాది మార్చిలోనే తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయినా యావజీవ్జశిక్షను అనుభవిస్తున్న దోషులు ఇప్పటికే 14 ఏళ్ళ పాటు జైల్లో ఉన్నారు కనుక వారి విడుదలకు గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వం మొగ్గు చూపింది. దోషుల విడుదల చట్ట ప్రకారమే జరిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అంటున్నారు. గుజరాత్ ప్రభుత్వం నియమించిన జైలు సలహా మండలి ఏకగ్రీవ తీర్మానం మేరకే వారి విడుదల ఖరారయిందంటున్నారు. గోద్రా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయిన కమిటీలో బిజెపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురు సంఫ్‌ు పరివార్‌కు చెందినవారు కావడం గమనార్హం. అందునా ముందుగానే ప్రభుత్వ పెద్దలు దోషుల విడుదలకు సానుకూలంగా ఉన్నారు. కనుక వారి విడుదలకు సంబంధించిన కమిటీ ఏర్పాటు కావడం, శిక్షాకాలం తగ్గించి విడుదల చేయడం అంతా చట్టప్రకారం జరిగిందని నమ్మబలకడానికి నిర్వహించిన తంతు మాత్రమేనని తేలిపోతున్నది.
కేంద్రప్రభుత్వ ఆమోదంతోనే ఖైదీల్ని విడుదల చేశామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో గుజరాత్ ప్రభుత్వం తెలియజేయడం విశేషం. అంతవరకు వారి విడుదలను గుజరాత్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంగా అందరూ భావించారు. కానీ ఈ అఫిడవిట్‌తో నరేంద్ర మోదీ-అమిత్ షాల పాత్ర ఏమిటో తెలిసిపోతున్నది. బిల్కిస్ బానో కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 11 మంది ఖైదీల విడుదలపై కేంద్రం సలహా కోరుతూ జూన్ 28న కేంద్ర హోం మంత్రిత్వశాఖకు గుజరాత్ ప్రభుత్వం లేఖ పంపింది. క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ సెక్షన్ 435 ప్రకారం శిక్షా కాలానికి రెమిషన్ ప్రకటిస్తూ దోషుల విడుదలను ఆమోదిస్తూ జూలై 11న గుజరాత్ ప్రభుత్వానికి సమాచారం పంపింది. అమిత్ షా నేతృత్వంలోని హోం మంత్రిత్వ శాఖ కేవలం రెండు వారాల్లో దోషుల విడుదల ప్రతిపాదనలకు అంగీకరించడం గమనార్హం.
నేర తీవ్రతని గమనించినందున దోషుల విడుదల ప్రతిపాదన సరయింది కాదని ముంబయి సిబిఐ కోర్టు జడ్జి, ముంబయి స్పెషల్ క్రైం బ్రాంచ్ చెప్పినప్పటికీ కేంద్ర, రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు దోషుల విడుదలకు వేగిరపడ్డాయి. కనుకనే బిల్కిస్ బానో కేసులో ఖైదీల విడుదల ఉద్దేశపూర్వకంగానే జరిగిందన్న ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూరింది. అంతేగాక గత పధ్నాలుగు సంవత్సరాల జైలు జీవిత కాలంలో ఈ ఖైదీలు దాదాపు వెయ్యిరోజులు పెరోల్ కింద పలుమార్లు బయటకు వచ్చారన్న వార్తలు వెలుగు చూశాయి. ఇందులోని నిజానిజాలేమిటో చెప్పాల్సిన బాధ్యత గుజరాత్ ప్రభుత్వానిదే.
కేవలం ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా ఈ ఖైదీలని విడుదల చేయలేదని, వారి సత్‌ప్రవర్తన కారణంగానే విడుదల చేస్తున్నామని గుజరాత్ ప్రభుత్వం చెప్పడం మరింత విడ్డూరం. అయితే ఆజాదీ కా అమృత్ ఉత్సవాల సందర్భంగా ఖైదీల విడుదలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన నియమ నిబంధనల ప్రకారం కూడా ఖైదీల విడుదల సమ్మతం కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అత్యాచారం ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఖైదీల విడుదల అంశాన్ని అసలు పరిశీలించకూడదు. ఇంత స్పష్టమైన మార్గదర్శకాలున్నప్పటికీ బిల్కిస్ బానో కేసులో ఖైదీల విడుదల ఏరకంగా చట్టసమ్మతమన్నది ప్రశ్నార్థకం.
అంతా చట్టప్రకారమే జరిగిందన్న కేంద్రమంత్రి మాట అబద్ధం. తాను నిర్దేశించుకున్న సూత్రాల్ని ఉల్లంఘించి దోషుల విడుదలకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆమోదం తెలపడం నిబంధనల్ని ఉల్లంఘించడమే. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనాన్నిత ప్రతిపక్షాలు అనేకసార్లు ప్రశ్నించాయి. సుప్రీంకోర్టుకు గుజరాత్ ప్రభుత్వం సమర్పించిన తాజా అఫిడవిట్‌తో నరేంద్రమోదీ-అమిత్ షాల పాత్ర చర్చానీయాంశమైంది. మోదీ-షాల పాలనా పర్వంలో మహిళలకు జరిగే న్యాయమిదేనా అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. అధికారపక్షానికి చెందిన వారు ఎలాంటి నేరాలకు పాల్పడినా వారిని తాము ఆదుకుంటామని చెప్పకనే చెప్పినట్టయింది ఈ ఉదంతంతో.
ఈ దురంతం దుశ్శాసన పర్వం, కీచకపర్వం కన్నా అత్యంత హేయమైనది, దుర్మార్గమైనది. ద్రౌపదిని జట్టుపట్టి ఈడ్చి, చీరను లాగి అవమానించిన దుశ్శాసనుడు పన్నెండేళ్ళ తర్వాతనైనా శిక్ష అనుభవించాడు. అలాగే సైరంధ్రిని చెరబట్టడానికి ప్రయత్నించిన కీచకుడ్ని తన ముష్టిఘాతాలతో మట్టి కరిపించాడు భీముడు. దుశ్శాసన, కీచక పర్వాల్లో నేరస్థులు శిక్ష అనుభవించారు. అక్కడ బాధిత మహిళకు న్యాయం జరిగింది. కానీ గర్భిణీగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరపడం, మైనర్ పిల్లలతో సహా వారి 13 మంది కుటుంబ సభ్యుల్ని పాశవికంగా చంపడం క్షమించరాని అపరాధం. ఈ అమానుషకాండకు పాల్పడిన దోషులకు శిక్షను తగ్గించి విడుదల చేయడం మోదీ-షా పాలనాపర్వంలో మనం చూస్తున్న క్రూర వాస్తవికత. నిర్భయ ఘటనలో నేరస్థుల్ని ఉరికంబాల్ని ఎక్కించారు. బిల్కిస్ బానో కేసులో విడుదలైన ఖైదీలకు స్వీట్లు పంచి స్వాగతం పలికారు. ఇది కాషాయ పాలనలోని ఘనకార్యం. మైనారిటీ మహిళకే కాదు ఏ మహిళకయినా అన్యాయం జరిగితే అధికారంలో ఉన్నవారు స్పందించే తీరు ఇదే అయితే అది ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ. జాతికి అప్రతిష్ట. నారీశక్తి గురించి ఎర్రకోట మీంచి అధినేత చెప్పిన మాటలన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలే అని ఎవరయినా అనుకుంటే అందులో ఆశ్చర్యమేముంది.