Telugu Global
National

ఇంట్లో క్రీస్తు ఫొటో ఉన్నంత మాత్రాన మతం మారినట్లు కాదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

పిటిషనర్ 12 తరగతి పూర్తి చేసుకొని, స్టేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో పాసయ్యింది. పై చదవులు కోసం పిటిషనర్ తండ్రి దరఖాస్తు చేయగా.. అధికారులు తిరస్కరించారు.

ఇంట్లో క్రీస్తు ఫొటో ఉన్నంత మాత్రాన మతం మారినట్లు కాదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
X

ఇంట్లో ఏసు క్రీస్తు ఫొటో ఉన్నంత మాత్రాన వాళ్లు మతం మారినట్లు కాదని.. దీని ప్రాతిపదికన ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని నిరాకరించడం తగదని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ సంచలన తీర్పు ఇచ్చింది. తాను ఎస్సీలోని మహర్ కులానికి చెందిన యువతినని, తనకు ఎస్సీ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలని కోరగా ఇంట్లో జీజస్ ఫొటో ఉందని నిరాకరించినట్లు ఒక యువతి హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్, జస్టిస్ ఊర్మిళ జోషి ఫాల్కేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్ 12 తరగతి పూర్తి చేసుకొని, స్టేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో పాసయ్యింది. పై చదవులు కోసం పిటిషనర్ తండ్రి దరఖాస్తు చేయగా.. అధికారులు తిరస్కరించారు. దీంతో ఆయన డిస్ట్రిక్ కాస్ట్ సర్టిఫికెట్ స్క్రూటినీ కమిటీ (డీసీసీఎస్సీ)ని ఆశ్రయించారు. కానీ డీసీసీఎస్సీ కూడా అతని అభ్యర్థనను కొట్టేసింది. దీంతో పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.

మహర్ కమ్యూనిటీని ఎస్సీలుగా రాజ్యాంగం గుర్తించింది. అయితే విజిలెన్స్ సెల్ మాత్రం ఇంట్లో క్రీస్తు ఫొటో ఉందని.. తండ్రి, తాత క్రైస్తవత్వంలోకి మారారని రిపోర్టు ఇచ్చింది. వీరికి బీసీ సర్టిఫికెట్ వస్తుంది. కానీ ఎస్సీ సర్టిఫికెట్ జారీ చేయలేమని పేర్కొన్నది. ఇదే విషయాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొని వెళ్లారు. తాము బౌద్ధ మతాన్ని ఆచరిస్తామని.. ఇంట్లో అన్నీ బౌద్ధాచారాలే జరుగుతాయని.. పెళ్లిళ్లు కూడా అదే ఆచారం ప్రకారం చేసుకున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇంటికి విచారణ నిమిత్తం వచ్చిన వ్యక్తికి జీజస్ ఫొటో కనిపించడంతో మేము క్రైస్తవులుగా పేర్కొన్నారని పిటిషనర్ తెలిపారు.

పిటిషనర్ తరపు లాయర్ వాదనలు విన్న నాగ్‌పూర్ బెంచ్ దాన్ని అంగీకరించింది. ఇంట్లో క్రీస్తు ఫొటో ఉన్నంత మాత్రాన క్రైస్తవత్వాన్ని ఫాలో అవుతున్నట్లు కాదని తెలిపింది. రాజ్యాంగంలోని అంశాలను విజిలెన్స్ సిబ్బంది పరిగణలోకి తీసుకోలేదని స్పష్టమవుతుందని తెలిపింది. పిటిషనర్‌కు వెంటనే సంబంధిత ఎస్సీ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

First Published:  20 Oct 2023 9:04 AM IST
Next Story