Telugu Global
National

చికాకు పెట్టే ఫోన్ కాల్స్, మెసేజ్ లు ఇక ఉండవు

అనధికారిక కాల్స్, మెసేజ్ ల వల్ల వినియోగదారులు ఇబ్బంది పడకుండా చూసేలా.. ట్రాయ్ ఇటీవల సమీక్ష నిర్వహించింది. వీటి వల్ల సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వినియోగదారులు నష్టపోతున్నారని తెలిపింది.

చికాకు పెట్టే ఫోన్ కాల్స్, మెసేజ్ లు ఇక ఉండవు
X

హలో మీకు లోన్ కావాలా, మీకు క్రెడిట్ కార్డ్ కావాలా, మీకు రియల్ ఎస్టేట్ పై ఆసక్తి ఉందా..? ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు అవసరం లేని ఫోన్ కాల్స్, మెసేజ్ లు చాలామందికి అనుభవమే. జంక్ కాల్స్ ని లిఫ్ట్ చేయకుండా ఉండటమే దీనికి ఉత్తమమైన పరిష్కారం. అయితే ఫోన్ దూరంగా ఉంటే, ఏదో అర్జంట్ కాల్ అని మనం వెళ్తే, తీరా అది కస్టమర్ కేర్ నుంచి వస్తే.. ఇలాంటి విసుగు తెప్పించే అనుభవాలు ఇకపై వినియోగదారులకు ఉండకుండా చూసేందుకు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్యలు తీసుకుంటోంది. చికాకు పుట్టించే కాల్స్, మెసేజ్ లకు చెక్ పెట్టే బాధ్యత టెలికం ఆపరేటర్లదేనని తేల్చి చెప్పింది.

అనధికారిక కాల్స్‌, మెసేజ్ లను నియంత్రించేందుకు ఇప్పటికే టెలికం సంస్థలు కొత్త టెక్నాలజీని వాడుతున్నట్టు తెలిపింది ట్రాయ్. ఇంకా చేయాల్సింది చాలా ఉందని పేర్కొంది. ప్రస్తుతం అనధికార మెసేజ్ లను అరికట్టేందుకు అమలు చేస్తున్న బ్లాక్‌ చైన్‌ బేస్డ్ ‘డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ (DLT)’ని మే 1 నుంచి కాల్స్‌ కు కూడా వర్తింపజేస్తామని తెలిపింది.

అనధికారిక కాల్స్, మెసేజ్ ల వల్ల వినియోగదారులు ఇబ్బంది పడకుండా చూసేలా.. ట్రాయ్ ఇటీవల సమీక్ష నిర్వహించింది. ఎయిర్‌ టెల్‌, జియో, వొడాఫోన్‌-ఐడియాతో సమీక్ష చేపట్టి కీలక ఆదేశాలిచ్చింది. అనధికారిక కాల్స్, మెసేజ్ ల వల్ల సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి వల్ల వినియోగదారులు నష్టపోతున్నారని తెలిపింది. స్కామ్ లకు కారణమయ్యే కాల్స్ ని కనిపెట్టేలా మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారిత వ్యవస్థను ఈ సమీక్షా సమావేశంలో వొడాఫోన్‌ ఐడియా ట్రాయ్‌ ముందుంచింది. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఆ సంస్థకు ట్రాయ్ అనుమతి ఇచ్చింది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే, మిగతా ఆపరేటర్లు కూడా ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది ట్రాయ్.

First Published:  29 March 2023 1:29 AM GMT
Next Story