బెంగళూరు ఆస్పత్రికి చేరుకున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
Taraka Ratna: ప్రస్తుతం తారకరత్నకు ఎక్మో సపోర్ట్ తో వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్నను చూసేందుకు కొద్దిసేపటి కిందటే జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి చేరుకున్నారు.
గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్నను చూసేందుకు ఆయన సోదరులు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆదివారం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకున్నారు. ఈనెల 27న నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడ ఆయన గుండెపోటు గురవడంతో మొదట కుప్పంలోని ఓ ఆసుపత్రిలో చికిత్సలు అందించి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు.
కాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య బృందం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న తారకరత్నను చూడటానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలిపారు. అయితే మరికొందరు నందమూరి కుటుంబ సభ్యులు మాత్రం 48 గంటలు గడిస్తే గానీ తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఏంటనేది చెప్పలేమని వైద్యులు ప్రకటించినట్లు చెప్పారు.
ప్రస్తుతం తారకరత్నకు ఎక్మో సపోర్ట్ తో వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్నను చూసేందుకు కొద్దిసేపటి కిందటే జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి చేరుకున్నారు. వారు తారకరత్నను చూసిన తర్వాత మీడియాతో మాట్లాడతారు. కర్ణాటక హెల్త్ మినిస్టర్ సుధాకర్ ఆసుపత్రి వద్దకు చేరుకొని తారకరత్న ఆరోగ్యస్థితిపై వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రముఖ కన్నడ సినీ నటుడు శివరాజ్ కుమార్ కూడా ఆస్పత్రికి చేరుకొని నందమూరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, మరికొద్ది సేపట్లో హాస్పిటల్ వైద్యులు తారకరత్న ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.