Telugu Global
National

మోడికి జర్నలిస్టుల క్యారెక్టర్ సర్టిఫికెట్లు కావాలట!

ప్రధాన మంత్రి కార్యక్రమం కవరేజ్ చేయాలంటే జర్నలిస్టులు క్యారెక్టర్ సర్టిఫికెట్లు ఇవ్వాలట. ఎక్కడా , ఎప్పుడూ లేని ఈ నిబందనను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒక్క ప్రైవేటు మీడియా సంస్థల జర్నలిస్టులే కాదు AIR, దూరదర్శన్ లలో పని చేసే జర్నలిస్టులు కూడా ఈ సర్టిఫికెట్లు ఇచ్చి తీరాలట.

మోడికి జర్నలిస్టుల క్యారెక్టర్ సర్టిఫికెట్లు కావాలట!
X

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనను కవర్ చేయడం కోసం జర్నలిస్టులకు సెక్యూరిటీ పాస్ లు కావాలంటే క్యారెక్టర్ సర్టిఫికెట్లను సమర్పించాలని అధికారులు నిబందన విధించారు.

ప్రైవేట్ యాజమాన్యంలోని ప్రింట్, డిజిటల్, న్యూస్ టెలివిజన్ జర్నలిస్టులు మాత్రమే కాదు, ఆల్ ఇండియా రేడియో (AIR), దూరదర్శన్‌తో సహా ప్రభుత్వ మీడియా ప్రతినిధులు కూడా "క్యారెక్టర్ వెరిఫికేషన్" సర్టిఫికెట్‌లను తీసుకురావాలని కోరారు. ఈ విషయంపై 2022 సెప్టెంబర్ 29న పోలీసులు అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.

అన్ని మీడియా సంస్థల‌ కరస్పాండెంట్‌లు, ఫోటోగ్రాఫర్‌లు, వీడియోగ్రాఫర్లు,దూరదర్శన్, AIR బృందాల జాబితాను "వారి డిజిగ్నేషన్ ధృవీకరణ సర్టిఫికేట్"తో పాటు క్యారెక్టర్ సర్టిఫికెట్ లు కూడా అందించాలని జిల్లా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (DPRO) జర్నలిస్టులను కోరారు.

"క్యారెక్టర్ వెరిఫికేషన్ సర్టిఫికెట్‌ను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, CID, బిలాస్‌పూర్ కార్యాలయానికి అక్టోబర్ 1, 2022లోగా అందించాలి. ర్యాలీ, మీటింగ్‌లో వారి యాక్సెస్ కు సంబంధించి పాసులను ఈ కార్యాలయం ఇస్తుంది.'' అని నోటిఫికేషన్ పేర్కొంది.

పోలీసు నోటిఫికేషన్‌పై సీనియర్ జర్నలిస్టు పంకజ్ పండిట్ స్పందిస్తూ, జర్నలిజంలో తన 22 సంవత్సరాల కెరీర్‌లో, ఎన్నడూ లేనిది మొదటిసారిగా ఇలాంటి విచిత్రమైన డిమాండ్‌ను చూస్తున్నట్లు ఇండియా టుడే టీవీతో అన్నారు.

"మోదీ జీ తొలిసారిగా రాష్ట్రాన్ని సందర్శించడం లేదు. క్యారెక్టర్ సర్టిఫికేట్ సమర్పించాలనే డిమాండ్ అవమానకరమైనది. మీడియా కార్యకలాపాలను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారు" అని పండిట్ అన్నారు.

ఈ విషయంపై బిలాస్‌పూర్ DPROని సంప్రదించినప్పుడు, జర్నలిస్టుల క్యారెక్టర్ సర్టిఫికేట్ తప్పనిసరి అని చెప్పారు.

"ఈ ఫార్మాలిటీ అందరికీ తప్పనిసరి. ఎస్పీ, సీఐడీ విభాగాలు క్యారెక్టర్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు అడుగుతున్నాయి'' అని డీపీఆర్వో కుల్దీప్ గులేరియా తెలిపారు.

హాస్యాస్పదమేమిటంటే జర్నలిస్టులు క్యారెక్టర్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు సమర్పించాలి కానీ ర్యాలీకి హాజరయ్యే వేలమంది ప్రజలు మాత్రం ఎలాంటి గుర్తింపు రుజువు ఇవ్వాల్సిన అవసరం లేదట‌.

ఇది మీడియా స్వేచ్చకు ఆటంకమా ? జర్నలిస్టులకు అవమానమా? సమాచారం తెలుసుకునే ప్రజల హక్కుకు ఇది భంగమా ? అనేది పక్కన పెడితే పాలకులకు ఎందుకింత భయం అనేది మాత్రం తీవ్రంగా ఆలోచించాలి.

First Published:  4 Oct 2022 11:50 AM IST
Next Story