2ఏళ్ళ తర్వాత జైలు నుండి బెయిల్ పై విడుదలైన జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్
2020 అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో ఓ దళిత యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటను రిపోర్ట్ చేయడానికి కేరళకు చెందిన కప్పన్ హత్రాస్ వెళ్తుండగా మధ్య దారిలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ కొద్ది సేపటి క్రితం జైలు నుండి విడుదలయ్యారు. తన బెయిల్ కోసం అవసరమైన ష్యూరిటీలను నిన్న ఆయన కోర్టులో సమర్పించిన తర్వాత గురువారం లక్నో జిల్లా జైలు నుండి బయటకు వచ్చారు. ఆయన అరెస్టయ్యి 28 నెలలయ్యింది.
2020 అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో ఓ దళిత యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటను రిపోర్ట్ చేయడానికి కేరళకు చెందిన కప్పన్ హత్రాస్ వెళ్తుండగా మధ్య దారిలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన హత్రాస్ లో హింసను రెచ్చగొట్టడానికి వెళ్తున్నాడని, అతనికి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, పలు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపారు.
ఆ తర్వాత కప్పన్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది.
చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంపై ఆయనపై నమోదు చేసిన కేసుకు ఆయనకు గత సెప్టంబర్ లోనే బెయిల్ వచ్చినప్పటికీ ఆయన ఇప్పటి వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసు కారణంగా జైలులోనే ఉన్నారు. ఈ కేసులో కూడా ఆయనకు బెయిల్ రావడంతో ఈ రోజు ఆయన విడుదలయ్యారు.
కాగా ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా ఆయన కుటుంబంతో సహా కేరళ జర్నలిస్టు సంఘం కూడా పోరాడింది. ఆయన అరెస్టును దేశవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. నిరసనప్రదర్శనలు నిర్వహించాయి.