Telugu Global
National

జోషిమఠ్ పాపం బీజేపీదే.. అందుకే అంతా సైలెన్స్

ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వార్తలు వస్తున్న నేపథ్యంలో NRSC నివేదికను వెబ్ సైట్ నుంచి తొలగించారు. ప్రజల్లో గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో ప్రభుత్వమే దానిని తొలగించినట్లు చెబుతున్నారు.

జోషిమఠ్ పాపం బీజేపీదే.. అందుకే అంతా సైలెన్స్
X

ప్రతిపక్షంలో ఉండగా జోషిమఠ్ విషయంలో బీజేపీ చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. కేదార్ నాథ్ వరదల తర్వాత ఉత్తరాఖండ్ లో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు పార్లమెంట్ లో మండిపడ్డారు. సుష్మా స్వరాజ్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు, అభివృద్ధి పనుల పేరుతో ఉత్తరాఖండ్ ని నాశనం చేస్తున్నారంటూ ఆమె పార్లమెంట్ లో మండిపడ్డారు. 2013లోని ఆ వీడియో ఇప్పుడు వైరల్ కావడం విశేషం. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో కూడా బీజేపీ ప్రభుత్వమే వచ్చింది. కానీ డబుల్ ఇంజిన్ కాస్తా ట్రుబుల్ ఇంజిన్ గా మారింది. ఇప్పుడు జోషి మఠ్ కుంచించుకుపోతోంది.

తప్పులు కప్పిపుచ్చుకోడానికే..

ఉత్తరాఖండ్‌ లోని జోషిమఠ్‌ లో భూమి వేగంగా కుంగుతోంది. అక్కడినుంచి ప్రజల్ని తరలిస్తున్నారు. భవాలను కూల్చేస్తున్నారు. దీనిపై ‘నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌’ (NRSC) కీలక విషయాలు వెల్లడించింది. 12 రోజుల వ్యవధిలోనే భూమి 5.4 సెంటీమీటర్ల మేల కుంగిపోయినట్టు ఇస్రోకు చెందిన NRSC నివేదిక వెల్లడించింది. ప్రభుత్వాల పాపమే జోషిమఠ్ కి శాపంగా మారిందని ఆరోపిస్తున్నారు స్థానికులు. అయితే ఇప్పుడు బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వార్తలు వస్తున్న నేపథ్యంలో NRSC నివేదికను వెబ్ సైట్ నుంచి తొలగించారు. ప్రజల్లో గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో ప్రభుత్వమే దానిని తొలగించినట్లు చెబుతున్నారు.

ప్రజలు, మీడియా సొంత కోణంలో వివరణలు ఇస్తున్నాయని, అందుకే జోషిమఠ్‌ తోపాటు దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (NDMA) పేర్కొంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని మీడియాతో గానీ, సామాజిక మాధ్యమాల్లో గానీ పంచుకోవద్దని, తగిన అనుమతి తీసుకోకుండా అనధికారికంగా వ్యాఖ్యలు చేయవద్దని ప్రభుత్వ విభాగాలకు తేల్చి చెప్పింది. నిపుణుల కమిటీ పూర్తిస్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత వాటిని వెబ్‌ సైట్‌ లో పొందుపరుస్తామని తెలిపారు NDMA అధికారులు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కూడా ఇదే మాట వల్లెవేస్తోంది.

ప్రతిపక్షాల విమర్శలు..

అయితే ఈ వాదనను కాంగ్రెస్‌ తోసిపుచ్చింది. సమస్యను పరిష్కరించేబదులు ప్రసార మాధ్యమాలపై ఆంక్షలు విధిస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విటర్లో ధ్వజమెత్తారు. ‘ఉపగ్రహ చిత్రాలు అబద్ధం చెబుతాయా? అని ప్రశ్నించారు. ఇదేనా నవ భారతం, ఒక వ్యక్తికే అన్నీ తెలుస్తాయా అంటూ ఆయన ప్రధానిని ఉద్దేశించి సెటైర్లు వేశారు. మరోవైపు జోషిమఠ్‌ కు సమీపంలోని సెలాంగ్‌ లో కూడా భూమి కుంగుతోంది. అక్కడ కొంతకాలం నుంచి ఇళ్లు బీటలు వారుతున్నాయి. ఎన్టీపీసీ జల విద్యుత్ కేంద్రం, సొరంగమార్గాల నిర్మాణమే తమ దుస్థితికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

First Published:  15 Jan 2023 1:43 PM IST
Next Story