Telugu Global
National

రాష్ట్రపతి ఎన్నికలతో గుజరాత్ కాంగ్రెస్‌లో ముసలం..

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు గుజరాత్ నుంచి పడిన ఓట్లు 57 మాత్రమే. అంటే 56 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక ఇండిపెండెంట్ యశ్వంత్ సిన్హాకు ఓటు వేయగా, ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం ద్రౌపది ముర్ముని బలపరిచి అధిష్టానానికి షాకిచ్చారు.

రాష్ట్రపతి ఎన్నికలతో గుజరాత్ కాంగ్రెస్‌లో ముసలం..
X

త్వరలో జరగబోతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా బలం పుంజుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. 2012 ఎన్నికల ఫలితాలతో పోల్చి చూస్తే 2017 ఫలితాలతో కాంగ్రెస్ అక్కడ బలపడింది. 2024లో అధికారం చేజిక్కించుకోవాలనేది హస్తం పార్టీ ఆలోచన. గతంలో నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా పనిచేసిన గుజరాత్ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీకి బలమైన నాయకత్వం లేదు. విజయ్ రూపానీ ప్లేస్ లో భూపేంద్ర పటేల్‌ని ముఖ్యమంత్రిగా నియమించినా పాలనలో ఆయన మార్క్ కనిపించడం లేదు. ఈలోగా కాంగ్రెస్ నుంచి హార్దిక్ పటేల్ వంటి కీలక నేతల్ని బీజేపీ తనవైపు తిప్పుకుంది. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఏడుగురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌కి హ్యాండిచ్చారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి ద్రౌపది ముర్ముకి వారు ఓటు వేశారు.

182 సీట్ల గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కి 63 మంది ఎమ్మెల్యేలున్నారు, ఒక ఇండిపెండెంట్ సపోర్ట్ కూడా ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు గుజరాత్ నుంచి పడిన ఓట్లు 57 మాత్రమే. అంటే 56 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక ఇండిపెండెంట్ యశ్వంత్ సిన్హాకు ఓటు వేయగా, ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం ద్రౌపది ముర్ముని బలపరిచి అధిష్టానానికి షాకిచ్చారు.

త్వరలో ఎన్నికలు.. అంతలోనే..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉన్న ఈ దశలో ఏకంగా ఏడుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కి పాల్పడటం కాంగ్రెస్‌కి మింగుడు పడటం లేదు. ఆ ఏడుగురు ఎవరనేదానిపై అధిష్టానం దృష్టి సారించింది. తిరుగుబాట్లను ఇప్పుడే అణచివేయాలని చూస్తోంది. ఎన్నికలకు టైమ్ దగ్గరపడే వేళ.. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదంటున్నారు పార్టీ సీనియర్ నేత సుఖ్ రామ్ రత్వ. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ ఉండదు, అదే సమయంలో బ్యాలెట్ ని బహిరంగంగా చూపించే వీలు లేదు. ఈ దశలో పార్టీకి ద్రోహం చేసినవారెవరనేది అంత తేలిగ్గా బయటపడదని అంటున్నారాయన. కానీ అధినాయకత్వంతో మాట్లాడి పార్టీ ద్రోహుల్ని ఏరిపారేస్తామని చెబుతున్నారు.

బీజేపీకి ప్రతిష్టాత్మకం..

గుజరాత్ రాష్ట్రం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. గతంలో మోదీ సీఎంగా ఉన్న ఈ రాష్ట్రంలో పట్టు కోల్పోతే బీజేపీకి అది తీరని నష్టం కలిగిస్తుంది. రెండేళ్లలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. అందుకే ఇప్పటి నుంచే గుజరాత్ లో బీజేపీ బలోపేతానికి మోదీ-షా ద్వయం పావులు కదుపుతోంది. హార్దిక్ పటేల్ చేరిక, ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేయడం వంటివి ఆ వ్యూహంలో భాగమే. మొత్తానికి రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా గుజరాత్ లో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ తనవైపు తిప్పుకుంది.

First Published:  22 July 2022 3:56 PM IST
Next Story