ఉపాధి లేని విద్య ఎందుకు..?
యునిసెఫ్ ప్రకారం.. భారతదేశంలోని దాదాపు 43 శాతం మంది బాలికలు తమ మాధ్యమిక విద్యను పూర్తి చేయకముందే చదువును వదిలేస్తున్నారు.
దేశంలో మహిళా విద్య అద్భుతంగా పురోగమిస్తోంది. గతంతో పోలిస్తే స్త్రీ విద్య పురోగతి సాధిస్తుండగా దానికి తగ్గట్టుగా ఉపాధి కల్పన ఉండటం లేదు. ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడంతో మహిళలు ఉన్నత, మాధ్యమిక విద్యను మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. హిందీ భాషలో గ్రాడ్యుయేట్ అయిన ఖుషీ ఓ వైపు పోలీస్ నియామక పరీక్షలకు సిద్ధమవుతూనే.. మరోవైపు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని నిశ్చయించుకుంది. ఎంత చదువుకున్నా ఆడపిల్లలకు ఉద్యోగాలు రావన్న భావన ఖుషీ తల్లిలో బలంగా నాటుకుపోయింది. అందుకే ఆమే తన కూతురుకి త్వరగా పెళ్లి చేయాలని భావిస్తోంది. ఇది కేవలం ఖుషీ ఒక్కదాని పరిస్థితే కాదు. దేశంలో చాలామంది మహిళలు ఇప్పుడు ఇదే తరహా సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్య.. ఉపాధిని చూపివ్వకపోతే ఇక ఆ చదువు ఎందుకు అనే సందిగ్ధంలో కేవలం ఖుషీ మాత్రమే కాదు.. దేశంలోని చాలామంది మహిళలు ఉన్నారు.
యునిసెఫ్ ప్రకారం.. భారతదేశంలోని దాదాపు 43 శాతం మంది బాలికలు తమ మాధ్యమిక విద్యను పూర్తి చేయకముందే చదువును వదిలేస్తున్నారు. దీనికి ఇంటి బాధ్యతలు, బాల్య వివాహాలు , బాలకార్మికులు, పాఠశాలలు ఎక్కువ దూరంలో ఉండడం, పారిశుధ్య సౌకర్యాలు లేకపోవడం వంటి వివిధ కారణాలు ఉన్నాయని యునిసెఫ్ వెల్లడించింది. ఉపాధి, కెరీర్ అవకాశాలు సరిగ్గా లేక సెకండరీ విద్య పూర్తి చేయకముందే బాలికలు చదువును అర్ధాంతరంగా ఆపేస్తున్నారు.
సమాజంలో చదువుకున్న యువతులు ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నప్పుడు అది మిగిలిన బాలికల విద్యపై అది తీవ్ర ప్రభావం చూపుతోందని NGOలో కార్యకర్త స్వప్నిల్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఉద్యోగాల కల్పనే బాలికల విద్యను ప్రభావితం చేసే కీలకమైన అంశంగా ఆమె గుర్తించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటా ప్రకారం దేశంలో 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు విద్యను అభ్యసిస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. మహిళలకు ఉపాధి, పేదరికం, నిరుద్యోగం ప్రధాన సమస్యలుగా మారాయి. గ్రామంలోని చాలామంది ఆడపిల్లలు చదువుకుని ఉద్యోగాలు లేకుండా ఇంట్లోనే ఖాళీగానే ఉంటున్నారు. ఇది మిగిలిన బాలికల విద్యపై ప్రభావం చూపుతోంది. చదువుకున్న అమ్మాయిలు వెంటనే పెళ్లి చేసుకోవాలని కోరుకోరు. ఉద్యోగం చేయాలనుకుంటారు. కానీ మహిళలకు తగినన్ని ఉద్యోగాలు లభించడంలేదు.
భారత్‌లో 2022 ప్రపంచ బ్యాంక్ వెల్లడించిన నివేదిక ప్రకారం 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో కేవలం 24 శాతం మంది మహిళలు మాత్రమే ఆర్థికంగా చురుగ్గా ఉన్నారు. 73.6 శాతం మంది పురుషులు కార్మిక శక్తిలో భాగం అయ్యారు. 1990 నుంచి దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం స్థిరంగా తగ్గుతోంది. ఇది దేశాభివృద్ధిపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. 2010లో కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్య రేటు 28.8 శాతంగా ఉండంగా అది 2020 నాటికి 22.7 శాతానికి పడిపోయింది. 1990 నుంచి భారత్‌లో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 30 శాతానికి మించలేదన్న కఠోర నిజాన్ని దేశం అంగీకరించక తప్పదు. దేశంలో ఎక్కువ మంది పురుషులకు ఉద్యోగాలు ఉన్నాయి. మహిళల కంటే పురుషులు ఉద్యోగంలో చేరే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంది. 15-49 ఏళ్ల మధ్య వయస్సు గల స్త్రీలలో 25 శాతం మంది ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నారు. అదే వయస్సులో ఉన్న పురుషులలో 75 శాతం మంది ఉద్యోగం చేస్తున్నారు. 2015-16లో 24 శాతం మంది మహిళలు ఉద్యోగం చేస్తుండగా...2019-2020లో అది 25 శాతానికి పెరిగింది. మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే మహిళల విద్య మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది.