Telugu Global
National

రాహుల్ బావ కన్నేశాడు.. స్మృతి ఇరానీ కౌంటర్

ఐదో విడత పోలింగ్‌లో భాగంగా అమేథీ స్థానానికి మే 20న ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ వరుసగా రెండో సారి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.

రాహుల్ బావ కన్నేశాడు.. స్మృతి ఇరానీ కౌంటర్
X

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ.. కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట. అయితే ఈ స్థానానికి కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా ఇక్కడి నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి, ఇక్కడి బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ రాహుల్‌ గాంధీపై విమర్శలు చేశారు. పోలింగ్‌కు ఇంకా 27 రోజులే ఉంది. కానీ, ఇంకా కాంగ్రెస్‌ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం వారి అహంకారానికి నిదర్శనం అన్నారు స్మృతి ఇరానీ. ఈ స్థానంపై రాహుల్‌ గాంధీ బావ కన్నేశారు. ఇప్పుడు రాహుల్ ఏం చేస్తారో?. ఒకప్పుడు బస్సుల్లో వెళ్లేటపుడు సీట్ల కోసం కర్చీఫ్‌ వేసుకునేవాళ్లు. పాపం ఇప్పుడు రాహుల్‌ కూడా అదే పని చేయాలేమో అంటూ సెటైర్ వేశారు స్మృతి ఇరానీ.

ఐదో విడత పోలింగ్‌లో భాగంగా అమేథీ స్థానానికి మే 20న ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ వరుసగా రెండో సారి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. 2019 కంటే ముందు వరుసగా 3 సార్లు రాహుల్‌ ఇక్కడి నుంచి గెలిచారు. గతంలో గాంధీ కుటుంబ సభ్యులు సోనియా, రాజీవ్‌, సంజయ్‌ కూడా ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు మంచి పట్టున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు హస్తంపార్టీ ఆదరణ కోల్పోతూ వస్తోంది. గత ఎన్నికల్లో అమేథీలో రాహుల్‌ ఓటమి కాంగ్రెస్ పార్టీని గట్టిగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గాంధీ కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి పోటీ చేస్తారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.

ఇదే సమయంలో ఇటీవల రాబర్ట్‌ వాద్రా చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. అమేథీ ప్రజలు తనను కోరుకుంటున్నారని, సరైన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మరోవైపు రాహుల్‌ స్పందిస్తూ.. పార్టీ చెప్పినట్లే నడుచుకుంటానని అన్నారు. రాహుల్ ప్రస్తుతం బరిలో ఉన్న కేరళలోని వయనాడ్‌ స్థానానికి ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగనుంది. ఇక అమేథీలో నామినేషన్‌కు మే 3 చివరి తేదీ. దీంతో వయనాడ్‌ పోలింగ్‌ తర్వాత అమేథీలో రాహుల్‌ పోటీపై ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

First Published:  23 April 2024 1:46 PM IST
Next Story