Telugu Global
National

తమిళనాడులోకి జిహాదీ గ్రూపులు..నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌

తమిళనాడులోకి ఉగ్రవాదులు ప్రవేశించే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. శ్రీలంకలో ఉన్న సంక్షోభ పరిస్థితుల వల్ల జీహాదీ గ్రూపులు దాడులకు తెగబడే అవకాశం ఉందని నిఘావర్గాలు చెప్తున్నాయి.

తమిళనాడులోకి జిహాదీ గ్రూపులు..నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌
X

శ్రీ‌లంక‌లో ప‌రిణామాల నేప‌ద్యంలో భార‌త్ లోకి ముఖ్యంగా త‌మిళ‌నాడు రాష్ట్రంలోకి జిహాదీ గ్రూపులు ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని నిఘా సంస్థ‌లు హెచ్చ‌రిస్తున్నాయి. లంకలో సంక్షోభ‌, ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను ఆస‌రా చేసుకుని మిలిటెంటు సంస్థ‌లు దాడుల‌కు తెగ‌బ‌డ‌వ‌చ్చ‌ని అనుమానిస్తున్నాయి. స‌రిహ‌ద్దుల గుండా మ‌న దేశంలోకి చొర‌బాట్లు కూడా జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌రిస్థితుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న నిఘా సంస్థ‌లు అప్ర‌మ‌త్తం చేస్తున్నాయి.

ఉగ్రవాదానికి సంబంధించి తమిళనాడుతో శ్రీలంక సంబంధాల వ‌ల్ల గతంలో కూడా హింసాయుత సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు గుర్తు చేస్తున్నాయి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో మే 1, 2014న రైలులో జరిగిన జంట పేలుళ్ళు, 2019లో కొలంబో బాంబు దాడుల తరువాత ఈ పేలుళ్లకు కారణమైన మాడ్యూల్‌కు తమిళనాడులో చాలా లింక్‌లు ఉన్న‌ట్టు తేలింద‌ని చెబుతున్నాయి. కొలంబోలో ఈస్ట‌ర్ సంద‌ర్భంగా జ‌రిగిన పేలుళ్ళ సూత్ర‌ధారితో తమిళ‌నాడు లోని టెర్ర‌ర్ మాడ్యూల్ స‌న్నిహితంగా ఉంద‌ని ఈకేసు ద‌ర్యాప్తులో పాల్గొన్న అధికారి ఒక‌రు తెలిపారు.

శ్రీ‌లంక ప‌రిణామాలను ఆస‌రా చేసుకుని రాడిక‌ల్ ఇస్లామిక్ గ్రూపులు భార‌త్ లోకి చొర‌బ‌డ‌వ‌చ్చ‌ని నిఘా సంస్థ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. గ‌త కొంత కాలంగా త‌మిళ‌నాడులో ఈ రాడిక‌ల్ ఇస్లామిజం విస్తృతంగా పాకింద‌ని, గ‌తంలో ఐఎస్ కు చెందిన మీడియా విభాగం అబూబ‌క‌ర్ అల్ బాగ్దాదీ ప్ర‌సంగాల‌ను త‌మిళభాష‌లో విడుద‌ల చేసిన‌ విష‌యాన్ని కూడా ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు ప్ర‌స్తావిస్తున్నాయి. 1990 లో శ్రీ‌లంక ఉత్త‌ర ప్రావిన్స్ ప్రాంతం నుంచి దాదాపు 72వేల మంది ముస్లింల‌ను ఎల్‌ట‌టిఈ బ‌ల‌వంతంగా పార‌దోలిన విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని, ఈ చ‌ర్య త‌మిళ‌ ముస్లింల‌లో తీవ్ర అసంతృప్తిక‌లిగించింద‌ని చెబుతున్నాయి.

తమిళనాడులో, అల్-ఉమ్మా అనే ఉగ్ర సంస్థ చాలా సంవత్సరాల క్రిత‌మే ప్ర‌వేశించింది. ఈ సంస్థ ప్రధానంగా హిందూ నాయకులను లక్ష్యంగా చేసుకుంది. కోయంబత్తూర్ పేలుళ్లకు కూడా బాధ్యత వహించింది. బెంగళూరులోని మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయం వెలుపల కూడా ఈ సంస్థ ఇటీవల పేలుళ్ళ‌కు పాల్పడింది. ఈ బృందంలోని సభ్యులకు శ్రీలంకలోని రాడికల్ ఎలిమెంట్స్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది.

అయితే, ఈ సమస్య కేవలం దక్షిణ భారతదేశానికే పరిమితం కాకపోవచ్చునని మరో అధికారి అభిప్రాయపడ్డారు. శ్రీ‌లంక‌లో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిస్థితులు దారుణంగా ఉన్నందున అక్క‌డ ఈ సమస్య మ‌రింత అదుపు తప్పే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

First Published:  22 July 2022 6:26 PM IST
Next Story