Telugu Global
National

ఝార్ఖండ్ లో హేమంత్ సొరేన్ దిగిపోతే సీఎం పీఠంపై భార్య కల్పన.. జెఎంఎం ప్రతిపాదన

ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూల్చేయాలన్న పట్టుదలగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుండగా అధికార జేఎంఎం మాత్రం తమ ప్రభుత్వానికేం ఢోకా లేదని చెప్తోంది. ఒక వేళ ఈసీ హేమంత్ సొరేన్ ను శాసన సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తే ఆయన భార్యను సీఎం చేయాలని జేఎంఎం ఆలోచిస్తోంది.

ఝార్ఖండ్ లో హేమంత్ సొరేన్ దిగిపోతే సీఎం పీఠంపై భార్య కల్పన.. జెఎంఎం ప్రతిపాదన
X

ఓ రాష్ట్ర సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వస్తే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతాయి. విపక్షాలు రంగంలోకి దిగి పవర్ ని చేజిక్కించుకోవడానికి నానా పాట్లు పడతాయి. కానీ ఝార్ఖండ్ రూటే సెపరేటు అన్నట్టుంది. అక్కడ మైనింగ్ స్కామ్ కేసులో మచ్చ పడినట్టు పేరు తెచ్చుకున్న సీఎం హేమంత్ సొరేన్ ని శాసన సభ్యత్వానికి అనర్హుడిగా ఈసీ ప్రకటించినప్పటి నుంచి పొలిటికల్ హీట్ పీక్ కి చేరింది. అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని అప్పుడే విపక్ష బీజేపీ డిమాండ్ చేస్తుండగా.. పాలక ఝార్ఖండ్ ముక్తి మోర్చా పవర్ ని నిలుపుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తోంది. నిన్న రాత్రంతా సమావేశమైన ఈ పార్టీ నేతలు ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయి.. ఎన్నికల్లో పోటీ చేయలేకపోతే .. ఆయన స్థానంలో ఆయన భార్య కల్పనా సొరేన్ ని గానీ, తల్లి రూపీని గానీ సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలన్నదే ఈ ప్రపోజల్ . సొరేన్ కి పదవీ గండం ఏర్పడితే ఆయన బదులు కల్పన ఫస్ట్ చాయిస్ అయితే బెటర్ అని జెఎంఎం నేతలు తీర్మానించినట్టు తెలుస్తోంది. ఈ సమాచారం ఎలా తెలిసిందో గానీ.. బీజేపీ అప్పుడే స్పందించేసింది. ఈ ప్రయత్నం వృధా ప్రయాసేనని, రాష్టంలో కల్పనకు ఎస్టీ స్టేటస్ లేదని ఈ పార్టీ అడ్డుపుల్ల వేసింది. ఆమె వంశస్థులు, కుటుంబ సభ్యులంతా ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాకు చెందినవారని.. రికార్డులు గుర్తు చేస్తున్నాయని బీజేపీ చెబుతోంది.

సొరేన్ తల్లి రూపీ ఉంది గానీ ఆమె ఈ 'బృహత్తర బాధ్యతలు' మోయగలదా అని జెఎంఎం మల్లగుల్లాలు పడుతోంది. వీళ్ళను కాదని ప్రత్యామ్న్యాయంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి జోబా మంజీ లేదా రవాణా శాఖ మంత్రి చాంపేయ్ సొరేన్ పేర్లను కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే జెఎంఎం, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. 81 స్థానాలున్న ఝార్ఖండ్ అసెంబ్లీలో బీజేపీకి 26 మంది సభ్యులున్నారు.

రాష్ట్ర గవర్నర్ రమేష్ బయాస్ మాత్రం హేమంత్ సొరేన్ అనర్హత విషయంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈసీ సిఫారసుపై గానీ, దాన్ని ఎలా అమలు చేస్తామన్నదానిపై గానీ ఆయన కార్యాలయం నుంచి స్పష్టత లేదు. తమ సీఎంని అనర్హునిగా ప్రకటించిన పక్షంలో దాన్ని సవాలు చేస్తూ తాము సుప్రీంకోర్టుకెక్కుతామని జెఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య ప్రకటించారు. జెఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని ఆయన అంటున్నారు. ఈ కూటమికి మొత్తం 49 మంది సభ్యులున్నారు. జెఎంఎం ఎమ్మెల్యేలే 30 మంది ఉన్నారని, తాము భయపడే ప్రసక్తే లేదని భట్టాచార్య చెప్పారు.

కాంగ్రెస్ కి 18 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో ముగ్గురు ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు డబ్బులు తీసుకు వెళ్తూ బెంగాల్ లోని హౌరాలో పట్టుబడ్డారు. అయితే పార్టీ వీరిని సస్పెండ్ చేసింది.

First Published:  26 Aug 2022 12:43 PM IST
Next Story