కాంగ్రెస్ గూటిలో తలదాచుకున్న జేఎంఎం ఎమ్మెల్యేలు..
30 మంది జేఎంఎం ఎమ్మెల్యేలు సహా మొత్తం 41 మందితో కూడిన ఓ విమానం రాయ్ పూర్ చేరుకుంది. ఎయిర్ పోర్ట్ నుంచి 3 బస్సుల్లో వారంతా ఫెమినా రిసార్ట్స్ కి వెళ్లారు. రిసార్ట్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తప్పో, ఒప్పో.. రిసార్ట్ రాజకీయాల్లో ఇటీవల తనను మించినవారు లేరని నిరూపించుకున్నారు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే. తన వర్గం ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీ పాలిత రాష్ట్రాలను చుట్టివచ్చారు. మహారాష్ట్రలో ఎమ్మెల్యేలుంటే ఉద్ధవ్ ఠాక్రే ప్రభావానికి లోనవుతారనే భయంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలతో కలసి తలదాచుకున్నారు షిండే. ముందు గుజరాత్, ఆ తర్వాత అస్సోంలో రిసార్ట్ రాజకీయాలు నడిపారు. ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు, ఇప్పుడు సీఎం అయ్యారు. అదే రూట్లో ఇప్పుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
జార్ఖండ్ లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. సీఎం సొరేన్ పై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ పై తుది నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమిషన్, ఆ నివేదికను రాజ్ భవన్ కు పంపించింది. అయితే గవర్నర్ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో జార్ఖండ్ లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. 81 సీట్లు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం బలం 30, బీజేపీ బలగం 25. కాంగ్రెస్ కు 16, ఇండిపెండెంట్లు ఇద్దరు, మరో మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు,ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సోరెన్, ఇప్పుడు బీజేపీ బారినుండి తన ఎమ్మెల్యేలను కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ప్రలోభాల నుంచి రక్షించుకోవడానికి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పాలిత ఛత్తీస్ గఢ్ కు తరలించారు. 30 మంది జేఎంఎం ఎమ్మెల్యేలు సహా మొత్తం 41 మందితో కూడిన ఓ విమానం రాయ్ పూర్ చేరుకుంది. ఎయిర్ పోర్ట్ నుంచి 3 బస్సుల్లో వారంతా ఫెమినా రిసార్ట్స్ కి వెళ్లారు. రిసార్ట్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పిల్లి తన పిల్లలను రక్షించుకున్నట్టు..
పిల్లి తన పిల్లలకోసం ఇల్లిల్లూ తిరుగుతుంది. ఎక్కడ ఏ చిన్న అపాయం ఉందని తెలిసినా వెంటనే ఆ ఇంటిని ఖాళీచేసి మరో ఇంటికి వెళ్తుంది. ఇలా ఇప్పుడు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని హేమంత్ సోరెన్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో తలదాచుకున్నారు. బీజేపీ ప్రలోభాల నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి, జార్ఖండ్ మరో మహారాష్ట్ర కాకుండా ఉండడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేఎంఎం పేర్కొంది. బీజేపీకి ఎమ్మెల్యేలను కొనడం, అమ్మడం మాత్రమే తెలుసని, రాజకీయాల్లో వ్యాపారం చేస్తున్న వారికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు సోరెన్.
ఆపరేషన్ లోటస్ ఏమవుతుంది..?
ఇటీవల ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక్కో ఎమ్మెల్యేకు 20కోట్ల ఎరవేసినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. అయినా ఎమ్మెల్యేలెవరూ బీజేపీతో వెళ్లలేదు. ఏకంగా విశ్వాస తీర్మానంతో బీజేపీకే షాకిచ్చారు ఆప్ అధినేత కేజ్రీవాల్. ఇప్పుడు జార్ఖండ్ లో కూడా ఆపరేషన్ లోటస్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అంటున్నారు. కర్నాటక, మహారాష్ట్ర ఉదాహరణలను దృష్టిలో ఉంచుకుని మిగతా రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. అసంతృప్తులను ఓ కంట కనిపెడుతున్నాయి. అనుమానం వస్తే చలో రిసార్ట్ అంటున్నాయి.