Telugu Global
National

రాత్రైనా సరే.. మా విమానం ఎగరాల్సిందే- బీజేపీ ఎంపీల దౌర్జన్యం

బీజేపీ ఎంపీలిద్దరు తమ కుటుంబసభ్యులతో కలిసి చార్టర్డ్ విమానంలో వెళ్లేందుకు వచ్చారు. అప్పటికే చీకటి పడటంతో ఎయిర్‌ ట్రాఫిక్ రూం సిబ్బంది విమానం టేకాఫ్‌కు అనుమతి ఇవ్వలేదు.

రాత్రైనా సరే.. మా విమానం ఎగరాల్సిందే- బీజేపీ ఎంపీల దౌర్జన్యం
X

జార్జండ్‌ బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబె, మనోజ్ తివారీలు ఎయిర్‌పోర్టులో దౌర్జన్యానికి దిగారు. జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌ ఎయిర్‌పోర్టు ఇటీవలే ప్రారంభమైంది. అక్కడ పగలు మాత్రమే విమానాలు ఎగిరేందుకు అవకాశం ఉంది. రాత్రి వేళల్లో విమానాల రాకపోకలకు అనుమతి లేదు.

బీజేపీ ఎంపీలిద్దరు తమ కుటుంబసభ్యులతో కలిసి చార్టర్డ్ విమానంలో వెళ్లేందుకు వచ్చారు. అప్పటికే చీకటి పడటంతో ఎయిర్‌ ట్రాఫిక్ రూం సిబ్బంది విమానం టేకాఫ్‌కు అనుమతి ఇవ్వలేదు. దాంతో ఎంపీలు ఇద్దరు ఏటీసీ రూములోకి వెళ్లి సిబ్బందిలో గొడవ పడ్డారు. తాము ఎంపీలమని, తమది చార్టర్డ్ ఫైట్ అని కాబట్టి రాత్రైనా సరే ఎగిరేందుకు అనుమతి ఇవ్వాలంటూ గొడవపెట్టుకున్నారు.

భయపడిపోయిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబె,మనోజ్ తివారీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదం అంతటితో ఆగలేదు. ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనపై డిప్యూటి కమిషనర్‌ మంజూనాథ్‌ భజంత్రీ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. ఆ వివరణపై ఎంపీ దూబేతో పాటు బీజేపీ శ్రేణులు ట్రోలింగ్ మొదలుపెట్టాయి. అయితే ఎంపీకి దీటుగా డిప్యూటీ కమిషనర్‌ కూడా కౌంటర్‌గా ట్విట్టర్‌లో సమాధానం ఇచ్చారు.

ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్‌ రూములోకి ఎంపీలు దౌర్జన్యంగా వెళ్లడం ద్వారా జాతీయ భద్రత నిబంధనలను ఉల్లంఘించారని డిసీ మంజునాథ్‌ భజంత్రీ విమర్శించారు. దాంతో ఎంపీ దూబే తీవ్రంగా స్పందించారు.'' మీరు ముందు ఏవియేషన్ నిబంధనలను చదువుకోండి. ఒక ఐఏఎస్‌ అయిన మీనుంచి దేశం మరింత మంచి పనితీరును ఆశిస్తోంది. ఇప్పుడు వ్యవహారం విచారణలో ఉంది. ముందు నిబంధనలు చదువుకుని ఆ తర్వాత స్పందించండి'' అంటూ ఎంపీ దూబే ఫైర్ అయ్యారు.

డిప్యూటీ కమిషనర్ మరోసారి గట్టిగా సమాధానం ఇచ్చారు. '' గౌరవ ఎంపీగారు. మీ సలహాకు ధన్యవాదాలు. ఈ అంశంపై నేను బాగానే స్టడీ చేశాను. ఎయిర్‌పోర్టులు భద్రతపరంగా చాలా సున్నితమైన ప్రాంతాలు. అక్కడికి అనుమతి లేకుండా చొరబడకూడదు'' అంటూ కౌంటర్ ఇచ్చారు.

దాంతో ఎంపీ దూబే అసలు ఎయిర్‌పోర్టులోకి వెళ్లి సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించే అధికారం నీకెవరు ఇచ్చారంటూ డిసీపై ఎదురుదాడి చేశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు మీరు ఇలా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. అసలు చార్టెర్డ్ ఫైట్‌లో వెళ్తున్నది నేను, నా పిల్లలు, నా మిత్రుడు... ఇక్కడ జాతీయ భద్రత ఎక్కడ ప్రమాదంలో పడిందంటూ ఎంపీ దూబే దాడి కొనసాగించారు. ఈ వ్యవహారంపై ఏవియేషన్ మినిస్టర్‌ స్పందించాలని ,ఎంపీలపై డీజీసీఏ చర్యలు తీసుకోవాలని జేఎంఎం డిమాండ్ చేసింది.

First Published:  4 Sept 2022 9:04 AM IST
Next Story