బీహార్ ప్రత్యేక హోదాకోసం జేడీయూ తీర్మానం..
గతంలో కూడా బీహార్ ప్రత్యేక హోదా డిమాండ్ తెరపైకి వచ్చింది. అప్పట్లో ఇండియా కూటమిలో ఉన్న జేడీయూ, హోదాకోసం తీర్మానం చేసింది, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో వచ్చాక మరోసారి తీర్మానం చేసింది.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ తాజాగా కూటమికి షాకిచ్చారు. బీహార్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ ని మళ్లీ ఆయన తెరపైకి తెచ్చారు. వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేశారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ జనతాదళ్(యునైటెడ్) ఈరోజు తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది.
కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఏర్పాటుకి ఈసారి జేడీయూ, టీడీపీ మద్దతు కీలకంగా మారింది. ఈ క్రమంలో బీహార్ ప్రయోజనాలు కాపాడేందుకు జేడీయూ కేంద్రంపై ఒత్తిడి చేస్తుందని, అదే క్రమంలో ఏపీ ప్రయోజనాలకోసం టీడీపీ కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచుతుందనే ప్రచారం జరిగింది. బీహార్, ఏపీ రెండూ.. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తాయని కూడా వార్తలొచ్చాయి. టీడీపీ ఇక్కడ సైలెంట్ గా ఉన్నా, అక్కడ జేడీయూ మాత్రం వెంటనే తమ డిమాండ్లను తెరపైకి తెచ్చింది. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో బీహార్ కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీ కోరుతూ తీర్మానం చేసింది. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలని కూడా ఆ పార్టీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక, కఠినచట్టం చేయాలని కోరింది.
గతంలో కూడా బీహార్ ప్రత్యేక హోదా డిమాండ్ తెరపైకి వచ్చింది. అప్పట్లో ఇండియా కూటమిలో ఉన్న జేడీయూ, హోదాకోసం తీర్మానం చేసింది, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో వచ్చాక మరోసారి తీర్మానం చేసింది. సొంతగా మెజార్టీ సాధించలేక మిత్రపక్షాల దయతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈ ఒత్తిడులకు తలొగ్గుతుందేమో వేచి చూడాలి. బీహార్ కి హోదా ఇస్తే కచ్చితంగా ఏపీకి కూడా హోదా వచ్చే అవకాశం ఉంటుంది. హోదా కుదరకపోతే ప్రత్యేక ప్యాకేజీతో అయినా నేతలు సరిపెట్టుకుంటారేమో వేచి చూడాలి.