Telugu Global
National

జయలలిత మరణానికి వాళ్ళే కారణమా ?... జస్టిస్ ఆర్ముగం కమిషన్ తేల్చిన నిజాలు

జయలలిత మరణం అనుమానాస్పదంగానే జరిగిందని జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ తేల్చి చెప్పింది. దీనిపై జ‌యలలిత సహాయకురాలు శశికళ, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సి విజయభాస్కర్‌, ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి డాక్టర్‌ జె రాధాకృష్ణన్‌, డాక్టర్‌ సి శివకుమార్‌‌లపై విచారణ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

జయలలిత మరణానికి వాళ్ళే కారణమా ?... జస్టిస్ ఆర్ముగం కమిషన్ తేల్చిన నిజాలు
X

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై దర్యాప్తు జరగాలని జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ సంచలన రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించింది.ఆమె మృతిపై అనుమానాలున్నాయని తేల్చిన కమిషన్ జ‌యలలిత సహాయకురాలు శశికళ, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సి విజయభాస్కర్‌, ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి డాక్టర్‌ జె రాధాకృష్ణన్‌, డాక్టర్‌ సి శివకుమార్‌‌లపై విచారణకు సిఫార్సు చేసింది.

జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా 2017సెప్టెంబరు 22న ఆమె ఇంట్లో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు ఆమెను ఆసుపత్రికి తరలించిన సమయంలో ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారు. అప్పటి నుంచి ఆమె చనిపోయేదాకా జరిగిన సంఘటనలన్నీ శశికళ గోప్యంగా ఉంచారని కమిషన్ తేల్చి చెప్పింది. జయలలిత మరణించిన విషయాన్నికూడా తప్పుగా ప్రకటించారని కమిషన్ తెలిపింది.

జయలలిత 2016 డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల మధ్య మరణించారని ఆరుముగస్వామి కమిషన్ నివేదికలో పేర్కొంది. అయితే జయలలిత డిసెంబర్ 5వ తేదీ రాత్రి 11.30 గంటలకు మరణించినట్లు అపోలో ఆసుపత్రి ప్రకటించింది. దీంతో జయలలిత మరణాన్ని ప్రకటించడంలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం జరిగిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అంతేకాదు జయలలితకు కంట్రోల్ కాని మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, హైపోథైరాయిడిజం, దీర్ఘకాలిక డయేరియా,క్రానిక్ బ్రోన్కైటిస్‌తో కూడిన ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్నాయి. జయలలితకు యాంజియో సర్జరీ చేయాలని బ్రిటీష్ వైద్యుడు రిచర్డ్ పీలే సహా పలువురు డాక్టర్లు సిఫార్సు చేశారు. అయితే ఆమెకు యంజియో సర్జరీ ఎందుకు నిర్వహించలేదనేది అతి పెద్ద ప్రశ్న అని నివేదిక పేర్కొంది.

జయలలిత మరణించినప్పుడే అనేక అనుమానాలు వచ్చిన నేపథ్యంలో 2017 నవంబర్‌లో ఆరుముగస్వామి కమిషన్ ఏర్పటు చేశారు. ఆ కమిషన్, జయలలితకు వైద్యం అందించిన వైద్యులు, అప్పటి అధికారులు, మంత్రులు, నాయకులు, ఇతరుల నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకుంది.150 మంది సాక్షులను విచారించిన తర్వాత ఈ రిపోర్టును ఇటీవల ప్రభుత్వానికి సమర్పించింది కమిషన్.

న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం.. జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ నివేదికను మంగళవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టింది.

మొత్తానికి అందరూ ఊహించినట్టే జయలలిత మరణం అనుమానాస్పదమనే విషయాన్నే కమిషన్ తేల్చింది. అయితే కమిషన్ సూచించినట్టు జయ‌లిత సహాయకురాలు శశికళ, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సి విజయభాస్కర్‌, ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి డాక్టర్‌ జె రాధాకృష్ణన్‌, డాక్టర్‌ సి శివకుమార్‌‌లపై విచారణ జరుపుతారాఅనేది తేలాల్సి ఉంది.

First Published:  19 Oct 2022 8:07 AM IST
Next Story