Telugu Global
National

పేరు పోలీస్.. పని ఉగ్రవాదం

జూలైలో జమ్మూకాశ్మీర్ పోలీసులు ఒక ఉగ్రవాదని అరెస్టు చేశారు. అతని ఫోను విశ్లేషించి, ఆ ఉగ్రవాదిని విచారించగా డీఎస్పీ ఆదిల్ ముస్తాక్ నిర్వాకం బయట పడింది.

పేరు పోలీస్.. పని ఉగ్రవాదం
X

డబ్బు కోసం ఉగ్రవాదులతో చేతులు కలిపిన జమ్మూకశ్మీర్ డీఎస్పీ షేక్ ఆదిల్ ముస్తాక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ స్థాయిలో ఉగ్రవాదులను పట్టుకోవాల్సిన స్థానంలో ఉంటూ వారికే సమాచారం ఇస్తూ సహాయం చేస్తున్నాడని ఆరోపించారు. జూలైలో జమ్మూకాశ్మీర్ పోలీసులు ఒక ఉగ్రవాదని అరెస్టు చేశారు. అతని ఫోను విశ్లేషించి, ఆ ఉగ్రవాదిని విచారించగా డీఎస్పీ ఆదిల్ ముస్తాక్ నిర్వాకం బయట పడింది. ఉగ్రవాదులు అరెస్టు కాకుండా తప్పించుకోవడం ఎలా అనే విషయంలో ఎప్పటికప్పుడు ఆదిల్ సలహాలు ఇస్తుంటాడని, తనకు నిరంతరం టచ్‌లో ఉంటాడని ఆ ఉగ్రవాది పోలీసులకు తెలిపినట్టుగా సమాచారం.

ఆదిల్ ముస్తాక్‌తో అతను దాదాపు 40 గంటల పాటు ఫోన్‌లో సంభాషించినట్లు బయటపడిందని, టెలిగ్రామ్ యాప్ ద్వారా ఫోన్ కాల్స్, సందేశాలతో ఉగ్రవాదులతో ఆదిల్ కాంటాక్ట్ లో ఉన్నాడని అధికారులు చెప్పారు. ఈ ఆధారాలతో ఆదిల్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా.. న్యాయమూర్తి అతనికి ఆరు రోజుల కస్టడీకి అప్పగించారు.

డీఎస్పీకి వ్యతిరేకంగా టెక్నికల్ సాక్షాలతో పాటు నగదు ఎలా అతని వద్దకు చేరిందని అంశాలను కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ అంశంపై పరిశోధన చేస్తున్న మరో ఉన్నతాధికారిని కేసులో ఇరికించేందుకు డీఎస్పీ ఆదిల్ ప్రయత్నించాడని వారు ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ఉండే అధికారిపై ఆదిల్ ఉగ్రవాదులతో కేసు పెట్టించినట్లు ఆధారాలు లభించాయన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.31 లక్షలు లంచంగా తీసుకున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

అంతే కాదు డీఎస్పీగా తన అధికారాన్ని ఉపయోగించి ఆదిల్ ముస్తాక్ పలువురు వ్యాపారుల నుంచి బలవంతంగా నగదు వసూళ్లకు పాల్పడ్డాడని, మహిళలను వేధించిన ఘటనలు కూడా ఉన్నాయని ఆరోపించారు. ఆదిల్‌పై ఉన్న ఆరోపణలు అన్నింటిపైనా విచారణ జరిపిస్తామని తెలిపారు.


First Published:  22 Sept 2023 2:51 PM IST
Next Story