జమిలి ఎన్నికలు.. అంత జల్దీ ఒడిసే ముచ్చట కాదు
నిజంగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు జమిలి ఎన్నికలు పెట్టాలంటే ఏకంగా 6 రాజ్యాంగ సవరణలు చేయాలి.
ఒకే దేశం- ఒకే ఎన్నిక అంటూ జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. చాలాకాలంగా ప్రభుత్వం మదిలో ఉన్న ఈ ప్రతిపాదనను పట్టాలెక్కించేందుకు సీరియస్‌గా ముందుకెళుతోంది. అసలు దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమవుతాయా అనేది అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఓ కమిటీని వేసింది.
ఒకేసారి ఎన్నికలంటే మాటలా?
లోక్‌సభ ఎన్నికలతోపాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వీలైతే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కలిపి ఒకేసారి నిర్వహించడమే జమిలి ఎన్నికలు. ఇలా చేయడానికి మనకు చాలా అడ్డంకులున్నాయి. ఎందుకంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదాహరణకు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సహా 5 రాష్ట్రాలకు ఈ ఏడాది చివరిలోగా ఎన్నికలు జరగాలి. అదే ఏపీకి 2024 మే వరకు సమయం ఉంది. మరికొన్ని రాష్ట్రాలకు 2025, ఇంకొన్ని రాష్ట్రాలకు 2026 వరకు కూడా టైమ్ ఉంది. కానీ లోక్‌సభ ఎన్నికలకు ఉన్న సమయం వచ్చే ఏడాది ఏప్రిల్ వరకే. అంటే ఒకేసారి అన్నింటికీ ఎన్నికలు జరగాలంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఆరు నెలలు ఆలస్యంగా గానీ, 2024, 2025న ముగిసే శాసనసభల పదవీ కాలాన్ని ముందే ముగించడం గానీ చేయాలి. ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికలకు చేసినా ఇదే పరిస్థితి.
నిజంగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు జమిలి ఎన్నికలు పెట్టాలంటే ఏకంగా 6 రాజ్యాంగ సవరణలు చేయాలి. లోక్‌సభ, రాజ్యసభల కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83, లోక్‌సభ ఐదేళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 83(2)11, అసెంబ్లీలకు ఐదేళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172 (1), రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356 తోపాటు ఆర్టికల్ 83(2), ఆర్టికల్ 85(2)(బి) లను సవరించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద రాజ్యాంగ సవరణలు చేయాలంటే జమిలి ఎన్నికలకు కనీసం సగం రాష్ట్రాలు ఒప్పుకోవాలట. కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే జమిలి ఎన్నికలు.. అంత జల్దీ ఒడిసే ముచ్చటైతే కాదు!