డేటా చోరీ: భారతీయుల గోప్యత,భద్రతలపై దాడి జరుగుతూ ఉంటే కేంద్రం ఏం చేస్తోంది? -కాంగ్రెస్ మండి పాటు
“ఇది భారతీయుల గోప్యత, భద్రతపై దాడి. మేము దీనిని అస్సలు అంగీకరించము. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి.'' అని జైరాం రమేష్ డిమాండ్ చేశారు.
66.9 కోట్ల మంది వ్యక్తులు, సంస్థల వ్యక్తిగత, రహస్య డేటా చోరీ వ్యవహారాన్ని సైబరాబాద్ పోలీసులు బైటపెట్టారు. దీనికి సంబంధించిన సూత్రదారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ కేంద్ర ప్రభుత్వం పై విరుచుకపడ్డారు.
దేశంలోని 24 రాష్ట్రాలు, ఎనిమిది మెట్రోపాలిటన్ నగరాల్లోని 104 కేటగిరీల్లో 66.9 కోట్ల మంది వ్యక్తులు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని సేకరించి విక్రయిస్తున్న హర్యానాలోని ఫరీదాబాద్ కు చెందిన
వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
దీనిపై ట్విట్టర్‌లో, జైరాం రమేష్ అనేక ప్రశ్నలను లేవనెత్తారు. భారతదేశంలోని 67 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఎలా, ఎందుకు దొంగిలించారు? సైన్యం డేటాను ఎవరు ఎలా దొంగిలించారు? “ఇది భారతీయుల గోప్యత, భద్రతపై దాడి. మేము దీనిని అస్సలు అంగీకరించము. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి.'' అని డిమాండ్ చేశారు.
ఈ డేటా చోరీ పై సైబరాబాద్ పోలీసులు చేసిన ట్వీట్ లో, “24 రాష్ట్రాలు, ఎనిమిది మెట్రోపాలిటన్ నగరాల్లోని 66.9 కోట్ల మంది వ్యక్తులు, సంస్థల వ్యక్తిగత,రహస్య డేటాను దొంగిలించడం, సేకరించడం, విక్రయించడం వంటి డేటా చోరీ ముఠాను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. నిందితుడు బైజూస్, వేదాంతు, క్యాబ్ వినియోగదారులు, GST, RTO, అమేజాన్, నెట్ ఫ్లిక్స్,పేటీఎం, ఫోన్ పే మొదలైన వివిధ సంస్థల నుండి డేటాను చోరీ చేశాడు.
నిందితుడు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉన్న 135 సంస్థల నుండి డేటాను దొంగిలించాడు.