ఈసారి విరుదునగర్‌లో పోరు ఆసక్తికరం
విరుదునగర్ నుంచి ఇప్పుడు సమ ఉజ్జీలు బరిలో దిగడంతో ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారింది. ఇక రాధిక రాజకీయ ప్రస్థానం 2006లో ప్రారంభమైంది.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులోని విరుదునగర్ లోక్‌సభ స్థానం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇరు పక్షాలూ సమ ఉజ్జీలైన అభ్యర్థులను బరిలో దించడమే దీనికి ప్రధాన కారణం. శరత్‌కుమార్, రాధిక కలసి ఏర్పాటు చేసిన ఏఐఎస్‌ఎంకే పార్టీని కొద్దిరోజుల క్రితమే బీజేపీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విరుదునగర్ స్థానం నుంచి రాధికా శరత్‌కుమార్‌కు సీటు కేటాయిస్తూ బీజేపీ శుక్రవారం ప్రకటించింది. ఇదే క్రమంలో అన్నాడీఎంకే విరుదునగర్ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించడం గమనార్హం. ఆ అభ్యర్థి ఎవరో కాదు.. డీఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత నేత విజయకాంత్ కుమారుడైన విజయ ప్రభాకరన్. పొత్తులో భాగంగా అన్నాడీఎంకే ఆ సీటును డీఎండీకేకు వెళ్లింది. పొత్తులో భాగంగా డీఎండీకేకి 5 లోక్‌సభ స్థానాలు దక్కాయి.
విరుదునగర్ నుంచి ఇప్పుడు సమ ఉజ్జీలు బరిలో దిగడంతో ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారింది. ఇక రాధిక రాజకీయ ప్రస్థానం 2006లో ప్రారంభమైంది. తన భర్త శరత్‌కుమార్‌తో కలిసి ఆమె అన్నాడీఎంకేలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అదే ఏడాది ఆ పార్టీ నుంచి వారిని తొలగించారు. 2007లో వారు ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్‌ఎంకే) పార్టీని స్థాపించారు. దానికి ఉపాధ్యక్ష హోదాలో రాధిక సేవలు అందించారు. కొద్దిరోజుల క్రితం ఏఐఎస్‌ఎంకేను బీజేపీలో విలీనం చేయగా, ఆ పార్టీ రాధికకు ఈ ఎన్నికల్లో సీటు కేటాయించింది. ఇక డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ గత ఏడాది డిసెంబర్‌లో మృతిచెందారు. ఆయన తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.