ఇండియాలో అతిచవకైన 5జీ ఫోన్.. రూ.9,699కే రిలీజ్ చేయబోతున్న ఐటెల్
ఐటెల్ పీ55 మోడల్ 5జీ ఫోన్‌లో మంచి ఫీచర్లున్నాయి. మీడియాటెక్ ప్రాసెసర్ ఉంది. అయినా అన్ని 5జీ నెట్‌వర్క్‌లను తక్కువ కనెక్టివిటీ ఉన్నవాటిని కూడా అందుకోగలుగుతుందని కంపెనీ చెబుతోంది.
ఇండియాలో 5జీ వచ్చి ఏడాదవుతున్నా ఇంకా దాని ప్రయోజనాలు పూర్తిగా జనానికి అందట్లేదు. 5జీ స్థాయి ఇంటర్నెట్ వేగం, కాల్ క్లారిటీ ఇవన్నీ అందుకోవాలంటే 5జీ హ్యాండ్‌సెట్ తప్పనిసరి. అయితే రేటు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది 5జీ హ్యాండ్‌సెట్స్ వైపు వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో 5జీ ఫోన్లను తక్కువ ధరకు అందుబాటులోకి తేవడానికి కంపెనీలు ముందుకొస్తున్నాయి. అదే బాటలో ఇప్పుడు ఐటెల్ కంపెనీ 10వేల కంటే తక్కువ ధరకే 5జీ ఫోన్‌ను తీసుకురాబోతోంది.
మంచి ఫీచర్లతో వస్తోంది
ఐటెల్ పీ55 మోడల్ 5జీ ఫోన్‌లో మంచి ఫీచర్లున్నాయి. మీడియాటెక్ ప్రాసెసర్ ఉంది. అయినా అన్ని 5జీ నెట్‌వర్క్‌లను తక్కువ కనెక్టివిటీ ఉన్నవాటిని కూడా అందుకోగలుగుతుందని కంపెనీ చెబుతోంది. 6.6 అంగుళాల డిస్‌ప్లే, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. 4జీబీ/ 6జీ ర్యామ్, 64 జీబీ/ 128 జీబీ రామ్ వేరియంట్లున్నాయి. ఫోన్ వెనుకవైపు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. రాత్రి సమయంలో కూడా క్లారిటీగా ఫొటోలు తీసుకునే సూపర్ నైట్ ఫీచర్ ఉంది.
రెండేళ్ల వారంటీ, స్క్రీన్ రీప్లేస్‌మెంట్
ఐటెల్ పేరు మొబైల్ మార్కెట్లో పెద్దగా వినిపించకపోయినా లోఎండ్‌లో 5, 6వేల రూపాయల ధరలో ఈ ఫోన్లకు వినియోగదారులు బాగానే ఉన్నారు. దీని మాతృసంస్థ చైనా కంపెనీ టెన్సెంట్ హోల్డింగ్స్. అయితే ఇన్ఫినిక్స్, టెక్నో తదితర ఇతర బ్రాండ్లు కూడా ఉన్న ఈ కంపెనీ నుంచి వస్తున్నందున ఐటెల్ ఫోన్ల మీద మరీ అంత డౌటేమీ అక్కర్లేదని టెక్ నిపుణులు చెబుతున్నారు. రూ.9,699 ధరకు ఈ ఫోన్ అక్టోబర్ 4 నుంచి అమెజాన్ తదితర ఆన్‌లైన్ సైట్లలో అందుబాటులోకి రానుంది.