Telugu Global
National

కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాల్సింది ప్ర‌ధాని కాదు.. - అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న విప‌క్షాలు

పీఎం మోదీ ప్రభుత్వాధినేత అని.. శాసనసభకు అధిపతి కాదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఎందుకు ప్రారంభించరని త‌న ట్వీట్‌లో ప్రశ్నించారు.

కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాల్సింది ప్ర‌ధాని కాదు.. - అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న విప‌క్షాలు
X

కొత్త పార్లమెంటు భవనాన్ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చేతుల‌మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయ‌డం స‌ముచితం కాద‌ని విప‌క్షాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి. ప్రధానమంత్రి ప్రభుత్వాధినేత అయితే, రాష్ట్రపతి భారత దేశానికి అధిపతి అని పేర్కొంటున్నాయి. రాష్ట్ర‌ప‌తి చేతుల‌మీదుగా ఎందుకు ప్రారంభించ‌ర‌ని ప్ర‌శ్నిస్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీ ఆదివారం ట్వీట్ చేస్తూ.. కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని, ప్రధాని కాదని పేర్కొన్నారు.

సావ‌ర్క‌ర్ జ‌యంతి రోజున చేప‌డుతుండ‌టంపై ఆగ్ర‌హం..

కొత్త పార్ల‌మెంటు భ‌వనాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేతుల‌మీదుగా మే 28న ప్రారంభించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. మే 28 హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ జయంతి. ఈ నేప‌థ్యంలో స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీని కలిశారని, కొత్త భవనాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించారని లోక్‌సభ సచివాలయం తెలిపింది. ఈ నేప‌థ్యంలో ప‌లువురు విప‌క్ష నేత‌లు దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

పీఎం మోదీ ప్రభుత్వాధినేత అని.. శాసనసభకు అధిపతి కాదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఎందుకు ప్రారంభించరని త‌న ట్వీట్‌లో ప్రశ్నించారు.

తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ రే స్పందిస్తూ.. ఈ ఏడాది న‌వంబ‌ర్ 26 నాటికి దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బహుమతిగా ఇచ్చిన భారత రాజ్యాంగం 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంద‌ని, ఆ రోజు సంస‌ద్ భ‌వ‌న్ ప్రారంభోత్స‌వానికి త‌గిన‌దని పేర్కొన్నారు. కానీ సావ‌ర్క‌ర్ జ‌యంతి రోజైన‌ మే 28న ప్రారంభోత్స‌వానికి సిద్ధ‌మ‌వ‌డం ఎంత‌వ‌ర‌కు స‌ముచిత‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

సావ‌ర్క‌ర్ జ‌యంతి నాడు ప్రారంభోత్స‌వం చేయ‌డం అంటే.. గాంధీ, నెహ్రూ, పటేల్, బోస్ వంటివారిని పూర్తిగా తిరస్కరించడంమ‌ని.. డాక్టర్ అంబేద్కర్‌ను నిర్మొహమాటంగా తిరస్కరించడమ‌ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు.

ప్రధానమంత్రి ప్రభుత్వాధినేత అయితే, రాష్ట్రపతి భారత దేశానికి అధిపతి అని, ఆమెను ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం కఠోరమైన అవమానం, ఆమె పదవిని కించపరచడమేనని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు.

First Published:  22 May 2023 1:34 AM GMT
Next Story