ఇస్రో సరికొత్త ఘనత.. అంతరిక్షంలోకి ఒకే సారి 36 శాటిలైట్లు
ఇస్రో చరిత్రలో జీఎస్ఎల్వీ రాకెట్ మొదటి సారిగా ఆరు టన్నుల పేలోడ్‌ను మోసుకెళ్లింది. ఇది తీసుకెళ్లిన 36 శాటిలైట్లు పూర్తిగా విదేశాలకు చెందినవే.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో రికార్డు చేరింది. ఎల్‌వీఎం3-ఎం2 రాకెట్ ద్వారా ఒకే సారి 36 శాటిలైట్లను అంతరిక్షంలో విజయవంతంగా ప్రయోగించారు. శనివారం అర్థరాత్రి (ఆదివారం 00.07 గంటలకు) నిప్పులు చిమ్మతూ జీఎస్ఎల్‌వీ- మార్క్3 (దీన్ని ప్రస్తుతం ఎల్‌వీఎం3 - లాంచ్ వెహికిల్ మార్క్3గా పిలుస్తున్నారు) నింగిలోకి దూసుకెళ్లింది. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ పోర్ట్ నుంచి 36 శాటిలైట్లను ఇది మోసుకెళ్లింది. శుక్రవారం అర్థరాత్రి ప్రారంభమైన కౌంట్‌డౌన్ 24 గంటల పాటు కొనసాగింది. ఆ తర్వాత జీఎస్ఎల్వీ-మార్క్ 3 ప్రయోగం ప్రారంభమైంది.
ఇస్రో చరిత్రలో జీఎస్ఎల్వీ రాకెట్ మొదటి సారిగా ఆరు టన్నుల పేలోడ్‌ను మోసుకెళ్లింది. ఇది తీసుకెళ్లిన 36 శాటిలైట్లు పూర్తిగా విదేశాలకు చెందినవే. ఇస్రో దీన్ని కమర్షియల్ ఆపరేషన్‌గా చేపట్టింది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఎస్ఐఎల్) అనే సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వన్‌వెబ్‌కు చెందిన 36 శాటిలైట్లను లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)లో ప్రవేశపెట్టింది. ఒక్కో బ్యాచ్‌లో 4 ఉపగ్రహాల చొప్పున.. మొత్తం 9 బ్యాచ్‌లలో 36 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి. ఇందులో ఒక్కో ఉపగ్రహం 142 కిలోల బరువు ఉంటుంది.
ఈ ఉపగ్రహాలన్నీ యూకేకి చెందినవి కావడంతో.. కక్ష్యలోకి వెళ్లిన శాటిలైట్స్ అన్నింటినీ యూకే గ్రౌండ్ స్టేషన్ నుంచి నియంత్రించనున్నారు. ఈ ప్రయోగం జరిగే సమయంలో ఇస్రో చీఫ్ డాక్టర్ సోమనాథ్ షార్ స్టేషన్‌లోనే ఉన్నారు. ఇక అమెరికా, ఫ్రాన్స్, యూకేకు చెందిన 14 మంది సైంటిస్టులు కూడా ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. జీఎస్ఎల్వీ - మార్క్ 3 రాకెట్‌లో మూడు దశలు ఉన్నాయి. మొదటి దశలో 200 టన్నుల ఘన ఇంధనం, రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధనం, మూడో దశలో 25 టన్నుల అతిశీతల క్రయోజనిక్ ఇంధనా్ని వాడారు. ఈ ప్రయోగానికి మొత్తం రూ. 160 కోట్లు ఖర్చు అయ్యింది. రాకెట్ ప్రయోగం మొత్తం పూర్తి కావడానికి 19 నిమిషాల 7 సెకెన్ల వ్యవధి పట్టింది.
తొలి 16 శాటిలైట్లను ప్రయోగించిన తర్వాత రాకెట్ భూమికి అవతలి వైపునకు వెళ్లిపోయింది. దీంతో అంటార్కిటికాలో ఉన్న ట్రాకింగ్ స్టేషన్లు ప్రయోగాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని శాటిలైట్లు విడిపోవడాన్ని పర్యవేక్షించాయి. చివరకు మొత్తం 36 శాటిలైట్లు నిర్ణీత కక్ష్యలోకి వెళ్లినట్లు మిషన్ డైరెక్టర్ తెలిపారు. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలంతా హర్షధ్వానాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో ఛైర్మన్ కూడా శాస్త్రవేత్తలందరికీ అభినందలు తెలియజేశారు.
వన్‌వెబ్ (OneWeb) అనే సంస్థ మొత్తం 588 శాటిలైట్లను ప్రయోగించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నది. లో ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టి ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ఇవ్వాలనేది ఆ సంస్థ లక్ష్యం. మొత్తం 12 రింగ్స్ (ఆర్బిటల్ ప్లేసెస్)లో ఒక్కో దాంట్లో 49 శాటిలైట్లను ఉంచబోతోంది. ఇవన్నీ భూమి నుంచి 1,200 కిలోమీటర్ల పైన తిరుగుతై ఉంటాయి. ఒక్కో శాటిలైట్ భూమిని చుట్టడానికి 109 నిమిషాలు పడుతుంది. ప్రతీ శాటిలైట్ ఒక్కో నిమిషం భూమిపై ఉన్న కొత్త ప్రదేశాలపై తిరుగుతూ సేవలు అందిస్తాయి.