Telugu Global
National

పని మొదలుపెట్టిన‌ ఆదిత్య L1

ఆదిత్య-ఎల్1 శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టిందని వెల్లడించింది. ఆదిత్య ఎల్1 ప్రయోగంలోని పరికరాలు తమ పనిని ప్రారంభించినట్లు ట్వీట్ చేసింది.

పని మొదలుపెట్టిన‌ ఆదిత్య L1
X

చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత మంచి ఉత్సాహంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రెట్టించిన ఉత్సాహంతో సూర్యుడిని టార్గెట్ చేసింది. సెప్టెంబరు 2న ఆదిత్య ఎల్ 1 మిషన్‌ను విజయవంతంగా నింగిలోకి పంపించింది. ఈ క్రమంలోనే సూర్యుడి వైపు క్రమంగా దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్ 1 ప్రయోగానికి సంబంధించి పలు దశల్లో కక్ష్య పెంపు విన్యాసాలను ఇస్రో సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆదిత్య ఎల్ 1 కు సంబంధించి కీలక అప్‌డేట్‌ను ఇస్రో ట్విట్ట‌ర్ వేదికగా పంచుకుంది.

ఆదిత్య-ఎల్1 శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టిందని వెల్లడించింది. ఆదిత్య ఎల్1 ప్రయోగంలోని పరికరాలు తమ పనిని ప్రారంభించినట్లు ట్వీట్ చేసింది. కీలకమైన శాస్త్రీయ సమాచారాన్ని సేకరించే పనిని ఆదిత్య ఎల్ 1 ప్రారంభించిందని, మిషన్‌లో భాగంగా అందులోని స్టెప్స్ పరికరానికి అమర్చిన సెన్సార్లు పని మొదలుపెట్టాయని తెలిపింది. భూమికి 50 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే సప్రా థర్మల్, ఎనర్జిటిక్ అయాన్స్, ఎలక్ట్రాన్స్‌ను కొలవడాన్ని ప్రారంభించినట్లు పేర్కొంది. భూమి చుట్టూ ఉండే కణాల ప్రవర్తనను పరిశోధించడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో వివరించింది. యూనిట్లలోని ఒక దాని ద్వారా సేకరించిన డేటా శక్తివంతమైన కణాల పర్యావరణంలో వైవిధ్యాలను ప్రదర్శిస్తుందని ఇస్రో తన ట్వీట్‌లో స్పష్టం చేసింది.

సూర్యుడి గుట్టు విప్పేందుకు, విస్తృత పరిశోధనలు చేసేందుకు నింగిలోకి పంపించిన ఆదిత్య ఎల్ 1 ప్రయోగం చంద్రయాన్ ప్రయోగాల్లా సూర్యుని ఉపరితలంపైన దిగడానికి అవకాశం లేదు. కేవలం భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 వరకు మాత్రమే ప్రయాణించనుంది. భూమి, సూర్యుని మధ్య అటువంటి ఐదు పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సమతుల్యంగా ఉంటుంది. ఒక వస్తువును ఇటువంటి స్థలంలో ఉంచినట్లయితే, అది సులభంగా రెండింటి మధ్య స్థిరంగా ఉంటుంది.

First Published:  18 Sept 2023 3:16 PM IST
Next Story