Telugu Global
National

మొద్దునిద్ర వదలని ల్యాండర్, రోవర్.. వేచి చూస్తామంటున్న ఇస్రో

విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లను స్లీప్‌ మోడ్‌ నుంచి యాక్టీవ్‌ మోడ్‌లోకి తీసుకురావడం పెద్ద సవాల్‌తో కూడిన అంశమని ఇస్రో ఛైర్మన్‌ తెలిపారు. ఒకవేళ రోవర్‌, ల్యాండర్లు పనిచేయడం మొదలు పెడితే మాత్రం గతం కన్నా మూడురెట్లు ఎక్కువ ఫలితాలు సాధించే అవకాశం ఉంద‌న్నారు.

మొద్దునిద్ర వదలని ల్యాండర్, రోవర్.. వేచి చూస్తామంటున్న ఇస్రో
X

చంద్రుడిపై సూర్యోదయమై మూడు రోజులు దాటినా చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ నుంచి ఎటువంటి సిగ్నల్ అందలేదు. అయితే.. సూర్యరశ్మి ల్యాండర్, రోవర్‌పై పడినప్పుడు అవి ఏ క్షణంలోనైనా మళ్లీ క్రియాశీలకం కావచ్చని ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ తెలిపారు. ‘‘ఇప్పటివరకూ ఎటువంటి సిగ్నల్ రాలేదు. అలా అని సిగ్నల్ ఇక ఎప్పటికీ రావ‌ని కూడా చెప్పలేం. మరో 14 రోజుల పాటు వేచి చూద్దాం. ఈ సమయంలో ల్యాండర్, రోవర్‌పై సూర్యరశ్మి పడుతూనే ఉంటుంది. కాబట్టి, వాటి ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. అంటే చివరి రోజున కూడా అవి క్రియాశీలకం కావచ్చు. తదుపరి ఏం జరుగుతుందో చెప్పడం అసాధ్యం’’ అని ఆయన అన్నారు.




అలాగే విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లను స్లీప్‌ మోడ్‌ నుంచి యాక్టీవ్‌ మోడ్‌లోకి తీసుకురావడం పెద్ద సవాల్‌తో కూడిన అంశమని ఇస్రో ఛైర్మన్‌ తెలిపారు. ఒకవేళ రోవర్‌, ల్యాండర్లు పనిచేయడం మొదలు పెడితే మాత్రం గతం కన్నా మూడురెట్లు ఎక్కువ ఫలితాలు సాధించే అవకాశం ఉంద‌న్నారు. ప్రస్తుతం ల్యాండర్‌లో 90 కిలోల ఇంధనం ఇంకా మిగిలే ఉంది. కానీ, మైనస్‌ 200 డిగ్రీల ఉష్ణోగ్రత కారణంగా ఇంధనం గడ్డ కడుతుంది. అది తిరిగి ద్రవరూపంలోకి మారటానికి శక్తి అవసరమని తెలిపారు. ఒకవేళ ఇంధనాన్ని మండించాలనుకున్నా కూడా ప్రొపల్షన్‌ సిస్టమ్‌ మొత్తం విఫలం అవుతుందని సోమ్‌నాథ్‌ వివరించారు. ప్రస్తుత ఉష్ణోగ్రతల వద్ద‌ ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్లు డ్యామేజ్‌ అవడంతోపాటు సాఫ్ట్‌ వేర్‌ కూడా పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందని ఇస్రో ఛైర్మన్‌ వెల్లడించారు.

ల్యాండర్, రోవర్ మళ్లీ మేల్కొంటాయా..? లేదా..? అన్న విషయం అటుంచితే చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో పేర్కొంది. చంద్రుడిపై సురక్షితంగా ల్యాండర్ దిగడం, చంద్రుడి ఉపరితలంపై రోవర్ తిరుగుతూ ప్రయోగాలు చేపట్టడం వంటి లక్ష్యాలను విజయవంతంగా చేరామని ఇస్రో ప్రకటించింది.

First Published:  24 Sept 2023 8:30 AM IST
Next Story