ఉపగ్రహాన్ని సముద్రంలో కూల్చేసిన ఇస్రో.. ఇదొక అరుదైన రికార్డు
ఏ ఉపగ్రహానికి అయినా మిషన్ జీవితం ముగిస్తే.. ఐక్యరాజ్యసమితి ఇంటర్-ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ (యూఎన్ఐఏడీసీ) నిబంధనలకు కట్టుబడి ఉండాలి.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఒక అరుదైన రికార్డును సృష్టించింది. కాలపరిమితి తీరిపోయిన ఓ ఉపగ్రహాన్ని పూర్తి స్థాయి నియంత్రిత విధానంలో సురక్షితంగా సముద్రంలో కూల్చివేసింది. మేఘ-ట్రోపికస్-1గా పిలుచుకునే ఈ ఉపగ్రహాన్ని పసిఫిక్ మహాసముద్రంలో కూల్చేసినట్లు మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే ఈ ఉపగ్రహం భూవాతావరణంలోకి ప్రవేశించిందని.. నెమ్మదిగా సముద్రంలోకి కూలిపోతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నది.
ఉష్ణమండల వాతావరణ, ఇతర వాతావరణ పరిస్థితుల అధ్యయనాల కోసం ఇస్రో, ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ ఉమ్మడిగా మేఘ-ట్రోపిక్స్1 (ఎంటీ-1)ను 2011 అక్టోబర్ 12న ప్రయోగించింది. మిషన్ ప్రారంభంలో మూడేళ్ల కాల వ్యవధికి పని చేసేలా ప్రణాళిక చేశారు. అయితే కాల పరిమితికి మించి దశాబ్దం పాటు ఇది వాతావరణానికి సంబంధించిన డేటాను అందించింది. అయితే.. ఏ ఉపగ్రహానికి అయినా మిషన్ జీవితం ముగిస్తే.. ఐక్యరాజ్యసమితి ఇంటర్-ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ (యూఎన్ఐఏడీసీ) నిబంధనలకు కట్టుబడి ఉండాలి.
యూఎన్ నిబంధనల ప్రకారం ఎంటీ-1ను వెంటనే కూల్చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీంతో ఇస్రో ఉపగ్రహాన్ని మంగళవారం రాత్రి క్రాష్ చేసింది. మేఘ-ట్రోపిక్స్-1లో ఇంకా 125 కిలోల ఇంధనం ఉన్నది. దీంతో ఉపగ్రహాన్ని పూర్తిగా కంట్రోల్‌లోకి తీసుకొనే రీ-ఎంట్రీ చేశారు. భూమి వాతావరణంలోకి ఉపగ్రహం ప్రవేశించే వరకు పూర్తిగా ఇస్రో కంట్రోల్‌లోనే ఉన్నది. ఆ తర్వాత కూడా భూమిపై పడకుండా పసిఫిక్ మహా సముద్రంలో పడేలా శాస్త్రవేత్తలు నియంత్రణ చేశారు.
ఇటీవల కాలంలో చైనాతో పాటు పలు దేశాలు ఉపగ్రహాలను కూల్చే ప్రక్రియలో విఫలమయ్యాయి. చాలా ఉపగ్రహాలు భూమిపై పడి ప్రజలను ఆందోళనకు గురి చేశాయి. అయితే ఈ విషయంలో భారత సంస్థ ఇస్రో మాత్రం విజయం సాధించింది. 'డీకమిషన్ చేసిన మేఘ-ట్రోపిక్స్-1 కోసం నియంత్రిత రీఎంట్రీ ప్రయోగం మార్చి 7న విజయవంతంగా నిర్వహించాము' అని ఇస్రో ట్వీట్ చేసింది.
The controlled re-entry experiment for the decommissioned Megha-Tropiques-1 (MT-1) was carried out successfully on March 7, 2023.
— ISRO (@isro) March 7, 2023
The satellite has re-entered the Earth’s atmosphere and would have disintegrated over the Pacific Ocean. pic.twitter.com/UIAcMjXfAH