Telugu Global
National

చంద్రయాన్‌–3.. ఇక ఆశల్లేవ్‌..! - ఇస్రో మాజీ చైర్మన్‌ వెల్లడి

ల్యాండర్, రోవర్లు మేల్కొంటాయన్న నమ్మకం లేదని, ఒకవేళ మేల్కోవాల్సి ఉంటే ఇప్పటికే అది జరిగి ఉండేదని స్పేస్‌ కమిషన్‌ సభ్యుడు కూడా అయిన కిరణ్‌కుమార్‌ తెలిపారు.

చంద్రయాన్‌–3.. ఇక ఆశల్లేవ్‌..! - ఇస్రో మాజీ చైర్మన్‌ వెల్లడి
X

చంద్రయాన్‌–3 ప్రాజెక్టుపై ఇక ఆశలు లేనట్టేనని ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. ఆ ప్రాజెక్టు ఇక ముగిసేనట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. చంద్రయాన్‌–3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపై అడుగు మోపిన విక్రమ్‌ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్లు చంద్రుడిపై చీకటి కావడంతో సెప్టెంబర్‌ 2న రోవర్, 4న ల్యాండర్‌లను శాస్త్రవేత్తలు నిద్రాణస్థితికి పంపారు. తిరిగి సెప్టెంబరు 22న చంద్రుడిపై సూర్యోదయమైనప్పటికీ అవి మళ్లీ మేలుకోలేదు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వాటిని మేల్కొలిపేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా.. ఫలితం కనిపించడం లేదు. అక్టోబర్‌ 6వ తేదీ నాటికి కూడా మేల్కోకపోవడంపై ఇస్రో మాజీ చైర్మన్‌ కిరణ్‌కుమార్‌ స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. భారత్‌ ప్రతిష్టాత్మకంగా పంపిన చంద్రయాన్‌–3 ప్రాజెక్టు ఇక ముగిసేనట్టేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ల్యాండర్, రోవర్లు మేల్కొంటాయన్న నమ్మకం లేదని, ఒకవేళ మేల్కోవాల్సి ఉంటే ఇప్పటికే అది జరిగి ఉండేదని స్పేస్‌ కమిషన్‌ సభ్యుడు కూడా అయిన కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఇక అవి నిద్రాణ స్థితి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని చెప్పారు. అయితే.. చంద్రయాన్‌–3ని విశాల దృక్కోణంలో చూసినప్పుడు అనుకున్న ఫలితం ఇప్పటికే వచ్చిందని తెలిపారు. ఏ దేశానికీ సాధ్యం కాని రీతిలో దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌ కాలుమోపిందన్నారు. ఇప్పటికే ఆ రీజియన్‌ నుంచి విలువైన సమాచారం మనకు అందిందని చెప్పారు. ఇది కచ్చితంగా ఉపయోగపడే సమాచారమని తెలిపారు. తదుపరి చేపట్టే ప్రాజెక్టుల్లో విజ్ఞానపరంగా, ప్లానింగ్‌ పరంగా ఆ ప్రాంతానికి సంబంధించి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.

చంద్రుడి నుంచి నమూనాలను తీసుకొచ్చే అవకాశాలపై కిరణ్‌ కుమార్‌ స్పందిస్తూ.. భవిష్యత్తులో ఇది సాధ్యం కావచ్చని పేర్కొన్నారు. సాంకేతిక సామర్థ్యాలు పెరగడం వల్లే చంద్రయాన్‌–3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ జరిగిందన్నారు. భవిష్యత్తులో చంద్రుని నుంచి నమూనాలను సేకరించి భూమిపైకి తీసుకొచ్చే ప్రాజెక్టులు కచ్చితంగా ఉంటాయన్నారు. టెక్నాలజీ అభివృద్ధి ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం ఉందన్నారు.

First Published:  7 Oct 2023 2:33 AM GMT
Next Story