రాహుల్ వ్యాఖ్యలతో ఉద్ధవ్ ఠాక్రే సంచలన నిర్ణయం?
సావర్కర్ బ్రిటిష్ వారికి భయపడి క్షమాబిక్ష కోరాడని, వారికి ఏజెంటుగా పనిచేశాడని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర లోని మహావికాస్ అగాడి కూటమిలో చీలికలకు దారి తీయనుందా ? ఉద్దవ్ ఠాక్రే కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకుంటారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
సావర్కార్ పై కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు శివసేన ఉద్ధవ్ వర్గం నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రాహుల్ వ్వాఖ్యలకు ఉద్ధవ్ నొచ్చుకున్నారని యుపిఎ కూటమినుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాహుల్ వ్యాఖ్యలు తమకు ఆమోదయోగ్యం కాదని ఉద్ధవ్ స్పష్టం చేశారు. ఇటీవలే ఉద్దవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే రాహుల్ భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి పాల్గొన్నారు. యువనేతల బంధం బలపడుతుందని అంతా భావించారు.
ఇంతలోనే రాహుల్ గాంధీ సావర్కర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన బ్రిటిష్ ప్రబుత్వానికి భయపడి ప్రాణభివక్ష పెట్టమని లేఖ రాశారంటూ ఆ లేఖను చదివి వినిపించారు. స్వాతంత్య్ర సమరయోధులైన నెహ్రూ ,గాంధీ, పటేల్ వంటి నాయకులెవరూ బ్రిటిష్ వారికి లొంగలేదన్నారు. వారెవరూ బ్రిటిష్ వారికి భయపడలేదని, క్షమాపణలు చెప్పలేదని వ్యాఖ్యానించారు. పైగా సావర్కర్ పిరికివాడని అభివర్ణించారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.