Telugu Global
National

సిద్ధ రామయ్య వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోందా?

సిద్ధరామయ్య సీఎం సీటు తనకు దక్కుతుందని ఆశపెట్టుకున్నారు. అధిష్టానం కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన సిద్ధ రామయ్య వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది.

సిద్ధ రామయ్య వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోందా?
X

కర్ణాటక సీఎంగా ఎవరిని నియమించాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఢిల్లీలోని పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఇంటిలో సోమవారం సుదీర్ఘంగా మంతనాలు జరిగాయి. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఏఐసీసీ పర్యవేక్షకులతో ఖర్గే చర్చలు జరిపారు. గెలిచిన 135 మంది ఎమ్మెల్యేల మనోగతాలు ఎలా ఉన్నాయో పర్యవేక్షకులను అడిగి తెలుసుకున్నారు. సిద్ధరామయ్య సీఎం సీటు తనకు దక్కుతుందని ఆశపెట్టుకున్నారు. అధిష్టానం కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన సిద్ధ రామయ్య వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అన్నీ తానై నడిపించింది డీకే శివకుమార్ అనేది అందరూ ఒప్పుకునే విషయమే. అయితే గతంలో ఈడీ, ఐటీ కేసుల్లో నిందితుడిగా ఉండి.. కొన్నాళ్లు జైలుకు కూడా వెళ్లొచ్చిన డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అతడిని ఇబ్బంది పెట్టవచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. శివకుమార్ విషయంలో ఈ కేసుల విషయమే పెద్ద అడ్డంకిగా మారిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎంగా ఎంపిక చేసిన తర్వాత శివకుమార్‌ను ఇబ్బంది పెడితే.. సర్కారులో చీలక వచ్చే ప్రమాదం ఉందని కూడా అంచనా వేస్తోంది. అందుకే అవినీతి ఆరోపణలు లేని సిద్ధ రామయ్య వైపు అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తున్నది.

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కూడా ఉన్నాయి. కర్ణాటకలోని పార్లమెంటు సీట్లు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారనున్నాయి. ఆ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలే రాబట్టాలంటే డీకే శివకుమార్ సేవలు అత్యంత ముఖ్యమని అధిష్టానం భావిస్తోంది. అందుకే ఈ రోజు శివకుమార్‌ను ఢిల్లీకి పిలిపించి మాట్లాడనున్నారు. సిద్ధరామయ్య, శివకుమార్‌లను ఒప్పించిన తర్వాతే తుది ప్రకటన చేయాలని చూస్తోంది. సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటిస్తే.. ఒక గౌరవ ప్రదమైన పదవిలో శివకుమార్‌ను ఉంచాలని నిర్ణయించింది.

కర్ణాటక సీఎం పదవిని నిర్ణయించే విషయంలో శివకుమార్ అభిప్రాయాలే కీలకంగా మారనున్నాయి. ఆయనను ఎలాగైనా ఒప్పించాలని.. మధ్యే మార్గంగా రెండున్నరేళ్లు ఇద్దరికీ పదవిని కట్టబెట్టేలా ఒప్పందమైనా కుదర్చాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. రాజస్థాన్ మాదిరిగా.. కర్ణాటక రాజకీయం తయారు కావొద్దని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇప్పటికే రాతపూర్వకంగా, సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో గెలిచిన 135 కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించారు. ఆ సంఖ్యను కూడా ఇద్దరి ముందు పెట్టి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ రోజు సాయంత్రంలోపు కర్ణాటక సీఎం క్యాండిడేట్ విషయంలో ఒక నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  16 May 2023 7:44 AM IST
Next Story