Telugu Global
National

ఇండియా ఇకపై భారత్ కాబోతోందా? కీలక బిల్లుకు సన్నాహాలు చేస్తున్న బీజేపీ!

ఇండియా పేరును భారత్‌గా మార్చే బిల్లుపై కసరత్తు చేస్తోందని.. పార్లమెంట్ సమావేశాల్లోనే దీనిని ప్రవేశపెట్టబోతున్నారని సమాచారం.

ఇండియా ఇకపై భారత్ కాబోతోందా? కీలక బిల్లుకు సన్నాహాలు చేస్తున్న బీజేపీ!
X

ఇండియా పేరు భారత్‌గా మారబోతోందా? ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించేది అందుకేనా? కీలకమైన బిల్లును బీజేపీ ప్రభుత్వం రూపొందించే పనిలో పడిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. బీజేపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోనున్నట్లు అర్థం అవుతోంది. ఇండియా పేరును భారత్‌గా మార్చే బిల్లుపై కసరత్తు చేస్తోందని.. పార్లమెంట్ సమావేశాల్లోనే దీనిని ప్రవేశపెట్టబోతున్నారని సమాచారం.

ఈ నెల 9, 10వ తేదీల్లో జీ20 సమావేశాలు ఢిల్లీ వేదికగా నిర్వహించనున్నారు. ఇండియా తొలిసారిగా అధ్యక్ష హోదాలో జీ20 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ క్రమంలో దేశానికి వచ్చే జీ20 ప్రతినిధులకు రాష్ట్రపతి భవన్ ఈ నెల 9న ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికల్లో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' బదులు 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని ముద్రించారు. విదేశాంగ శాఖకు చెందిన ప్రోటోకాల్ సెక్షన్ ఈ ఆహ్వాన పత్రికలు ముద్రించింది.

జీ20 ఆహ్వాన పత్రికలపై 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని ముద్రించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ఈ విషయంపై మండిపడ్డారు. భారత్ అని పేరు మార్చుకున్నా.. ఈ దేశం మాత్రం 'రాష్ట్రాల సమాఖ్య'గానే ఉంటుందని చురకలంటించారు. 'అయిదే ఆ వార్త నిజమే అన్నమాట. రాష్ట్రపతి భవన్ ఇచ్చే జీ20 విందు ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాశారు. అంటే దీని ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ని.. భారత్, అంటే ఇండియా రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది అని చదువుకోవాలి. ఇప్పుడు రాష్ట్రాల సమాఖ్య‌పై కూడా దాడి జరుగబోతోంది' అని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.

మరోవైపు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా ఒక సంచలన ట్వీట్ చేశారు. 'రిపబ్లిక్ ఆఫ్ భారత్.. మన నాగరికత అమృత్ కాల్ వైపు నడుస్తున్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఒకవైపు బీజేపీ సీఎం ఇలా రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం, రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రికల్లో 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని ముద్రించడంతో ఎన్డీయే సర్కారు లక్ష్యం ఏంటో స్పష్టం అవుతోంది. ప్రత్యేక సమావేశాల్లో భారత్ అనే పేరు మార్పిడి బిల్లు తప్పకుండా ప్రవేశ పెడతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇండియన్ పీనల్ కోడ్, ఇతర కీలకమైన చట్టాల పేర్ల నుంచి ఇండియాను తీసి వేశారు. ఇప్పుడు రాష్ట్రపతి ఆహ్వానాల నుంచి కూడా ఇండియా తొలగించారు. పరిస్థితులు అన్నీ గమనిస్తే.. భారత్ అనే పేరు రావడం ఖాయమనే చర్చ జరుగుతున్నది.






First Published:  5 Sept 2023 1:01 PM IST
Next Story