ఈడీ తాత్కాలిక డైరెక్టర్‌గా ఐఆర్ఎస్ అధికారి రాహుల్ నవిన్
ఈడీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన సంజీవ్ కుమార్ మిశ్రా 2018 నవంబర్ 19న తొలి సారిగా బాధ్యతలు చేపట్టారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇంచార్జి డైరెక్టర్‌గా ఐఆర్ఎస్ అధికారి రాహుల్ నవిన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1993 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన నవిన్.. ఈడీకి పూర్తి స్థాయి డైరెక్టర్ వచ్చే వరకు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ ప్రస్తుత డైరెక్టర్ సంజీవ్ కుమార్ పదవీ కాలం ముగియడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈడీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన సంజీవ్ కుమార్ మిశ్రా 2018 నవంబర్ 19న తొలి సారిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2020 నవంబర్‌లో ఆయన పదవీ కాలాన్ని మరో 3 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం ఆయన ఈ ఏడాది నవంబర్ 18 వరకు పదవిలో ఉండాలి. అయితే, సంజీవ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని చట్ట విరుద్దంగా పెంచారంటూ కాంగ్రెస్ నాయకులు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, జయ ఠాకూర్.. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మహువా మొయిత్రా, సాకేత్ గోఖలే సుప్రీంకోర్టులో కేసు వేశారు.
కాగా, సంజీవ్ పదవీ కాలాన్ని నవంబర్ వరకు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం వాదించిది. కానీ అత్యున్నత న్యాయస్థానం మాత్రం కేంద్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. సెప్టెంబర్ 15 వరకు మాత్రమే సంజీవ్‌కు సమయం ఇచ్చింది. దీంతో ఆయన శుక్రవారం ఈడీ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఇక తాత్కాలిక బాధ్యతల్లో నియమించబడిన రాహుల్ నవిన్ రెండు నెలల పాటు ఈ పోస్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి లోగా ఈడీకి కొత్త డైరెక్టర్ వస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.